మూలుగ బొక్క కోసం గొడవ.. పెళ్లి సంబంధం రద్దు

మూలుగ బొక్క కోసం జరిగిన ఒక లొల్లి.. పెళ్లి సంబంధం క్యాన్సిల్‌ అయ్యే వరకు తీసుకెళ్లింది.

By Srikanth Gundamalla  Published on  24 Dec 2023 11:22 AM IST
Fight,  Mooluga Bokka, marriage cancel, jagtial,

 మూలుగ బొక్క కోసం గొడవ.. పెళ్లి సంబంధం రద్దు 

తెలుగులో వచ్చిన బలగం సినిమా ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. బంధూత్వాల కథ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలిచింది. గ్రామాల్లో సైతం ఈ సినిమాను ప్రదర్శించి మానవ సంబంధాల విలువలను కాపాడుకోవాలని అన్నారు. అయితే.. ఈ సినిమాలో బావబావమర్ధుల మధ్య గొడవ ఏ కారణంగా మొదలవుతుందో తెలిసిందే. అదే మూలుగ బొక్క కారణం చూపించి గొడవ పెట్టుకుంటారు. ఆ తర్వాత విడిపోయి చాలా ఏళ్ల పాటు దూరంగా ఉంటారు. అయితే.. సరిగ్గా ఇలాంటి ఘటనే నిజంగానూ జరిగింది. మూలుగ బొక్క కోసం జరిగిన ఒక లొల్లి.. పెళ్లి సంబంధం క్యాన్సిల్‌ అయ్యే వరకు తీసుకెళ్లింది.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన అబ్బాయి, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయం అయ్యింది. ఇరు వర్గాల కుటుంబ సభ్యులు పెళ్లికి ఇచ్చే కట్నకానుకలు కూడా మాట్లాడుకున్నారు. అంతా బాగా జరుగుతోంది. ఇక నవంబర్‌ మొదటి వారంలో వివాహ నిశ్చితార్ధ కార్యక్రమం పెట్టుకున్నారు. ఆడపెళ్లి ఇంటి వద్దే నిశ్చాతార్థ కార్యక్రమం నిర్వహించారు. అబ్బాయి తరఫు కుటుంబ సభ్యులు, బంధువులు అంతా వచ్చి నిశ్చితార్థం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత భోజనాలు పెట్టారు అమ్మాయి వారు. మాంసాహారంతో భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే అబ్బాయి తరఫు వారు మూలుగ బొక్క కావాలని అడిగారు. లేదని చెప్పడంతో.. గొడవ మొదలు అయ్యింది. చిన్న గొడవ చిలిచిలిచి గాలివానగా మారింది.

చివరకు మూలుగ బొక్క గొడవ పోలీస్‌ స్టేషన్‌ వరకూ చేరింది. పోలీసులు కేసు నమోదు చేయకుండా ఇరు వర్గాల వారికి నచ్చజెప్పారు. దాంతో.. ఇరువురు శాంతించారు. కానీ.. పెళ్లి సంబంధం మాత్రం రద్దు చేసుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాగా.. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూలుగ బొక్క కోసం గొడవపడి పెళ్లి సంబంధం రద్దు చేసుకున్నారనే విషయం తెలుసుకున్నవారు ముక్కున వేలేసుకుంటున్నారు.

Next Story