Hyderabad: ప్రగతిభవన్‌లో ఘనంగా విజయదశమి వేడుకలు

ప్రగతి భవన్‌లో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

By Srikanth Gundamalla  Published on  23 Oct 2023 4:30 PM IST
dussehra, celebrations,  pragathi bhavan, cm kcr,

 Hyderabad: ప్రగతిభవన్‌లో ఘనంగా విజయదశమి వేడుకలు

తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు విజయదశమి సంబరాలు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ కూడా దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ప్రగతి భవన్‌లో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దసరా పండుగను పురస్కరించుకుని తొలుత ప్రగతి భవన్ లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో సీఎం కుటుంబ సమేతంగా వేదపండితుల మంత్రోశ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ, మంత్రి కెటిఆర్, కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు పాల్గొన్నారు. అనంతరం శమీపూజ నిర్వహించారు. ఇందులో భాగంగా సాంప్రదాయ పద్దతిలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు, విజయాలు సిద్ధించాలని ఆశీర్వచనం ఇచ్చారు.

శుభసూచకంగా భావించే పాలపిట్టను సిఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు. సాంప్రదాయం ప్రకారం దసరానాడు ప్రత్యేకంగా నిర్వహించే వాహన పూజలో మనుమడు హిమాన్షుతో పాటు సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం సాంప్రదాయ పద్దతిలో వేదపండితులు నిర్వహించిన ఆయుధ పూజలో పాల్గొన్నారు. పూజాకార్యక్రమాలు ముగిసిన అనంతరం ప్రగతి భవన్ అధికారులు, సిబ్బంది సిఎం కేసీఆర్ నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అందరికీ సిఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా దీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు సీఎం కేసీఆర్.

విజయదశమి సందర్భంగా కర్నాటక లోని శృంగేరీ పీఠం నుంచి తీసుకుని వచ్చిన శారదాదేవి నవరాత్రోత్సవ ప్రసాదాన్ని సీఎం కేసీఆర్ దంపతులకు పూజారులు అందజేశారు. కాశ్మీర్ లోని శారద స్వరజ్జపీఠం దేవాలయ జ్జాపికను తెలంగాణ మాసపత్రిక ఎడిటర్ అష్టకాల రామ్మోహన్ రావు సీఎం కేసీఆర్‌కు అందించారు.

Next Story