డీజే వినియోగంపై నిషేధం.. ఉల్లంఘిస్తే కేసులు: రాచకొండ సీపీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ కీలక ఉత్తర్వులను జారీ చేశారు.
By Srikanth Gundamalla Published on 2 Oct 2024 5:43 PM ISTతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ కీలక ఉత్తర్వులను జారీ చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మతపరమైన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్ వినియోగంపై నిషేధం విధిస్తూ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. డీజేల నుంచి అధిక డెసిబెల్స్ తో ఉత్పన్నమయ్యే శబ్దాల కారణంగా హృద్రోగులకు గుండెపోటు, ఇతర హృదయ సంబంధ ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయని చెప్పారు. అలాగే చిన్నపిల్లలకు శాశ్వత వినికిడి సంబంధ సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నట్టు పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయని అన్నారు. అంతే కాక సామాన్య ప్రజలు, ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్యం దెబ్బతింటుందనే కారణంతో ఇకపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఊరేగింపుల్లో డిజే సౌండ్ మిక్సర్లు, యాంప్లిఫయర్, బాణాసంచా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ పోలీసు కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు కూడా తీసుకుంటామని ఆయన అన్నారు. నిబంధనలు, ప్రభుత్వ అనుమతులను ఉల్లంఘిస్తే బీఎన్ఎస్ 223, 280, 292, 293, 324, బీఎన్ఎస్ఎస్ 152, పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్ 15 కింద కేసులు నమోదు చేస్తామని సీపీ వెల్లడించారు. ఈ నిషేధ ఉత్తర్వులను ఎవరైనా అతిక్రమిస్తే ఐదేళ్లు జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా ఉంటుందని కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఈ ఉత్తర్వులు పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాచకొండ పరిధిలోని అన్ని జోన్ల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. ప్రజలకు, విధుల్లో ఉండే అధికారులకు కలుగుతున్న ఇబ్బందులు, తలెత్తున్న సమస్యలను విశ్లేషించి అందరీ అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు.