ఆర్‌ఎంపీ డాక్టర్ నిర్వాకం..ఇంజెక్షన్ వికటించి దివ్యాంగుడు మృతి

మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్‌ఎంపీ డాక్టర్‌ నిర్వాకానికి ఒక దివ్యాంగుడు బలి అయ్యాడు.

By Srikanth Gundamalla  Published on  4 Oct 2023 11:12 AM GMT
disabled man, died, injuction, RMP Doctor  ,

 ఆర్‌ఎంపీ డాక్టర్ నిర్వాకం..ఇంజెక్షన్ వికటించి దివ్యాంగుడు మృతి

మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్‌ఎంపీ డాక్టర్‌ నిర్వాకానికి ఒక దివ్యాంగుడు బలి అయ్యాడు. జ్వరం వచ్చిందని ఆర్‌ఎంపీ డాక్టర్‌ వద్దకు చికిత్స కోసం వెళ్లాడు ఒక దివ్యాంగుడు. అయితే.. అక్కడ ఆర్‌ఎంపీ డాక్టర్‌ ఇచ్చిన ఇంజెక్షన్‌ అతడి ప్రాణాలను బలి తీసుకుంది.

మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలానికి చెందిన చింతలూరి యాకన్న (32) అనే దివ్యాంగుడు గత నెల 18 నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. ఎంతకీ తగ్గకపోవడంతో ఆస్పత్రిలో చూపించుకునేందుకు నిర్ణయం తీసుకున్నాడు.దాంతో.. స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ డాక్టర్‌ యాకయ్య వద్దకు వెళ్లాడు దివ్యాంగుడు. అతడిని పరిశీలించిన ఆర్‌ఎంపీ డాక్టర్‌ గ్లూకోజ్‌ పెట్టాడు. ఆ తర్వాత మధ్యలో పేషెంట్‌ చలితో ఇబ్బంది పడ్డాడు. అది గమనించిన డాక్టర్‌ వెంటనే ఇంజెక్షన్‌ ఇచ్చాడు. అప్పటికి సర్ధుకోవడంతో దివ్యాంగుడు యాకన్న ఇంటికి వెళ్లాడు.

అలా ఇంటికి వెళ్లిన తర్వాత యాకన్న అస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఎంత లేపినా లేవ్వకపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే తొర్రూరులోని ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ యాకన్నను పరిశీలించిన డాక్టర్లు పేషెంట్‌ పరిస్థితి విషమంగా ఉందని వెంటనే ఖమ్మం జిల్లాకు తీసుకెళ్లాలని చెప్పారు. దాంతో.. కుటుంబ సభ్యులు కూడా వేగంగానే ఖమ్మం జిల్లా కేంద్రంలోని మరో ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ దివ్యాంగుడు యాకన్నకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. మరోసారి హైదరాబాద్‌కు తీసుకొచ్చి యాకన్నకు చికిత్స చేయిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజాము 5 గంటలకు యాకన్న చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే.. తమ ఊర్లో ఆర్‌ఎంపీ డాక్టర్‌ ఇచ్చిన ఇంజెక్షన్ కారణంగానే యాకయ్య ప్రాణాలు కోల్పోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సదురు ఆర్‌ఎంపీ డాక్టర్‌ యాకయ్య కుటుంబ సభ్యులతో కలిసి పారిపోయాడని తెలుస్తోంది.

Next Story