మరోసారి ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు.

By Srikanth Gundamalla  Published on  14 Sept 2023 2:17 PM IST
Delhi liquor Scam,  ED notice, MLC Kavitha,

మరోసారి ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు విచారణ హాజరు కావాలని గురువారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. అరుణ్ పిళ్లై అప్రూవర్‌గా మారిన తర్వాత కవితను మరోసారి విచారణకు పిలవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈ కేసులో కీలకంగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన బిజినెస్‌మెన్ అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారారు. ఈ మేరకు సీఆర్పీసీ సెక్షన్ 164 కింద ప్రత్యేక న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చినట్లుగా సమచారం. ఈ క్రమంలో అరుణ్ నుంచి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. అరుణ్ రామచంద్రన్ పిళ్లై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బినామీగా ఈడీ అభియోగం మోపింది. గత మార్చి 7న ఈడీ అధికారులు పిళ్లైని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అంతేకాకుండా పలు దఫాలుగా రామచంద్ర పిళ్లై ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కూడా నిర్వహించారు.

ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన అప్రూవర్గా మారిన తర్వాత కవితకు నోటీసులు జారీ చేయడం కీలకంగా మారింది. లిక్కర్‌ స్కాం కేసులో ఇన్ని రోజులు ఎలాంటి విచారణ లేకపోవడంతో ఈ కేసు విషయంలో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక, తెలంగాణలో అసెం‍బ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ తాజాగా కవితను ఈడీ విచారణకు పిలవడం హాట్‌ టాపిక్‌గా మారింది. రాబోయే రోజుల్లో ఈ కేసు విచారణ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అని ఉత్కంఠ నెలకొంది.

Next Story