డిసెంబర్ 9.. తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు
December 9th changed Future of Telangana state .. డిసెంబర్ 9వ తేదీ.. ఇది తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు. ఉమ్మడి
By సుభాష్ Published on 9 Dec 2020 9:57 AM ISTడిసెంబర్ 9వ తేదీ.. ఇది తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణ ఏర్పడాలన్న బలమైన డిమాండ్ విజయానికి తోడైన రోజు. తెలంగాణ ఏర్పడాలన్న చేస్తున్న ఉద్యమానికి చివరి అంకానికి చేరిన రోజు డిసెంబర్ 9. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో డిసెంబర్ 9వ తేదీ ఎంతో ప్రాముఖ్యమైన రోజుగా గుర్తింపు పొందింది. ఎన్నో ఏళ్ల నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలన్న రాష్ట్ర సాధన కలకు సాకారం లభించింది. 2009 డిసెంబర్ 9 కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రోజు. ఆ రోజు రాత్రి పార్లమెంట్‌లో అప్పటి మంత్రి చిదంబరం చేసిన ప్రకటన రాష్ట్ర ఆవిర్బావానికి నాంది పలికింది. ఆ తర్వాత ఐదేళ్లకు ఉద్యమానికి పుల్‌స్టాప్ పడి 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రం అవతరించింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ అస్త్రంగా వాడుకున్నాయి. కానీ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రసమితి ఉద్యమ పోరాటం కొనసాగించింది. ఈ ఉద్యమంలో టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని ముందుకెళ్లారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని మాత్రం వీడలేదు. కేసీఆర్ ఉద్యమం మొదలు పెట్టినప్పటికీ నుంచి ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది.
కేసీఆర్ దీక్ష
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవాలనే ఉద్యమం ప్రారంభమైనప్పటినుంచి తెలంగాణలో గులాబీ పార్టీ ఉద్యమాన్నిప్రజల్లో తీసుకెళ్లింది. ఈ ఉద్యమంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు రాష్ట్ర సాధనలో భాగస్వాములయ్యాయి. తెలంగాణ ఉద్యమానికి ప్రముఖ పాత్ర పోషించిన టీఆర్‌ఎస్ పార్టీ.. ఉద్యోగాల భర్తీలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న డిమాండ్‌తో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.
నవంబర్ 29న కేసీఆర్ మొదలు పెట్టిన దీక్ష ఉద్యమానికి ఊపిరి పోసింది. కరీంనగర్‌లో కేసీఆర్‌ను పోలీసులు అరెస్టు చేయడం, ఖమ్మం తరలించం, పోలీసుల అదుపులో ఉన్నా నిరహార దీక్ష కొనసాగించడంతో రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేసీఆర్ ఆరోగ్యం క్షీనించడంతో ఖమ్మం నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించింది అప్పటి ప్రభుత్వం. నిమ్స్ ఆస్పత్రిలో యధావిధిగా దీక్షను కొనసాగించారు కేసీఆర్. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
ఇక ఉద్యమం రోజురోజుకు తారాస్థాయికి చేరుకోవడంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని డిసెంబర్ 9న పార్లమెంట్‌లో అధికారికంగా ప్రకటించింది. త్వరలో సంప్రదింపులు మొదలు పెడతామన్న కేంద్ర ప్రభుత్వ హామీ కేంద్ర సర్కార్ హామీతో కేసీఆర్ ఆమరణ దీక్షను విరమించారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావంపై చిక్కుముడులు పడ్డాయి. దీంతో కేసీఆర్ మరోసారి తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు.
రాజకీయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచించారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయక తప్పలేదు. దశాబ్దాల సాకారం కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఎట్టకేలకు సాకారమైంది. 2014, జూన్ 2 నుంచి కొత్త రాష్ట్ర ఏర్పడింది.