నిరుద్యోగులు ఆందోళనలు వదలండి.. అండగా నేనున్నా: సీఎం రేవంత్‌రెడ్డి
రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో అగ్నిమాపక శాఖ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 26 July 2024 1:30 PM ISTనిరుద్యోగులు ఆందోళనలు వదలండి.. అండగా నేనున్నా: సీఎం రేవంత్‌రెడ్డి
రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో అగ్నిమాపక శాఖ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. అంనతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. గత పదేళ్లలో నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి కోసం ఎంతో ఎదురు చూశారని అన్నారు. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 90 రోజుల్లో 31 వేల ఉద్యోగ నియామక పత్రాలను అందించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇక రాష్ట్ర బడ్జెట్‌లో విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
కాగా..తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాకముందు.. ప్రభుత్వ ఉద్యోగులు జీతాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ.. ఇప్పుడు వేతనాలను ఒకటో తారీఖునే ఇస్తున్నామన్నారు. ప్రజల ఆలోచనలు వినడం తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. బడ్జెట్‌లో విద్య, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. పేదలకు మంచి నాణ్యమైన విద్యనందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వాస్తవాలకు అనుగుణంగా తమ బడ్జెట్ ఉందన్నారు. ఇక పాసింగ్ అవుట్ పరేడ్ పూర్తి చేసుకున్న వారికి సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. జీతభత్యాల కోసం పనిచేసే ఉద్యోగం కాదనీ.. విపత్తును జయించే సామాజిక బాధ్యతగా పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో నిరుద్యోగులు నిరసనలు, ఆందోళనలు చేస్తున్న విషయంపైనా సీఎం రేవంత్ స్పందించారు. నిరుద్యోగులు ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదు అన్నారు. మంత్రులు, ఉన్నతాధికారులను కలవాలని సూచించారు. అన్నగా తాను ఎప్పుడూ అండగానే ఉంటానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో యువత తమ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవడం లేదని తెలిసిందనీ.. దయచేసి పేరెంట్స్‌ను ప్రేమగా చూసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.