కత్తిపోట్లకు పాల్పడుతున్నారు.. మొండికత్తి మాకూ దొరకదా?: సీఎం కేసీఆర్
దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడిని సీఎం కేసీఆర్ ఖండించారు.
By Srikanth Gundamalla Published on 30 Oct 2023 11:29 AM GMTకత్తిపోట్లకు పాల్పడుతున్నారు..మొండికత్తి మాకూ దొరకదా?: సీఎం కేసీఆర్
దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిపై కత్తిపోట్ల ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక వ్యక్తి చేతిలో కత్తిపోటుకి గురైన కొత్త ప్రభాకర్‌రెడ్డిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. కొందరైతే ఇది రాజకీయ హత్యాయత్నమే అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనకు పాల్పడ్డ నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని విచారణ తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత తెలిపిన విషయం తెలిసిందే. అయితే.. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తి పోట్ల దాడిపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడిని సీఎం కేసీఆర్ ఖండించారు. బాన్సువాడ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్... ఎంపీపై జరిగిన దాడి గురించి మాట్లాడారు. చేతకాని దద్దమ్మ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని సీఎం కేసీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ఇది రాజకీయమా..? అరాచకమా? అని ప్రశ్నించారు. కడుపు, నోరు కట్టుకుని పని చేస్తున్న వారిపై ఈ తరహాలో దాడులకు పాల్పడటం ఏంటని ప్రశ్నించారు. కత్తి పట్టుకొని పొడవాలంటే ఇంత మంది ఉన్నాం.. మాకు కత్తి దొరకదా మొండిదో ఏదో మాకో కత్తి దొరకదా? అన్నారు. పని చేతకాక.. ఎన్నికలను ఎదుర్కొనే దమ్ములేక దద్దమ్మలు కత్తులతో దాడులకు దిగుతున్నారంటూ సీఎం కేసీఆర్ ఆరోపించారు. ప్రభాకర్ రెడ్డి మీద జరిగిన దాడి కాదని.. కేసీఆర్ మీద జరిగిన దాడి అని పేర్కొన్నారు. ఇలాంటి ప్రతిపక్ష నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
పెద్ద పెద్ద రాష్ట్రాల్లో లేని అభివృద్ధి తెలంగాణలో జరిగిందన్నారు సీఎం కేసీఆర్. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్‌లో ఉందన్నారు. పదేళ్లు నీతి, నిబద్ధతో పనిచేస్తేనే అది సాధ్యమైందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక బాన్సువాడలో అన్ని నియోజకవర్గాలకంటే ఎక్కువ అభివృద్ధి జరిగిందన్నారు. పోచారం సారథ్యంలో బాన్సువాడ బంగారువాడలా మారిందని సీఎం కేసీఆర్ ప్రశంసించారు.