కోకాపేట భూముల ధరలు..రాష్ట్ర ప్రగతికి దర్పణం: సీఎం కేసీఆర్
భూముల ధరలు పెరగడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి సాక్ష్యం అని సీఎం కేసీఆర్ అన్నారు.
By Srikanth Gundamalla
కోకాపేట భూముల ధరలు..రాష్ట్ర ప్రగతికి దర్పణం: సీఎం కేసీఆర్
హైదరాబాద్‌లో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో జరిగిన కోకాపేట భూముల వేలంలో ఎకరం రూ.100 కోట్లకు పైగా పోయి రికార్డులను తిరగరాసింది. ఈ వేలం ప్రక్రియలో దేశంలోని దిగ్గజ కంపెనీలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ భూముల ధరల గురించి అసెంబ్లీలో మాట్లాడారు. భూముల ధరలు పెరగడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి సాక్ష్యం అని సీఎం కేసీఆర్ అన్నారు.
దిగ్గజ కంపెనీలు పోటీ పడి మరీ తెలంగాణలోని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూములు కొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయని కేసీఆర్ అన్నారు. భూముల ధరలు పెరగడం అంటే తెలంగాణ అభివృద్ధికి దర్పణం అని చెప్పారు. భూములను భారీ ధరలకు కొనడాన్ని ఆర్థిక కోణంలోనే కాదు.. తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి కోణంలోనూ విశ్లేషించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా హైదరాబాద్ నగర అభివృద్ధి సూచిక అందనంత ఎత్తుకు దూసుకుపోతోందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఇక్క జనాలు ఆగం అవుతారని.. నీళ్లు ఉండవని.. కరెంటు ఉండదని.. భూముల రేట్లు పడిపోతాయని ఎందరో భయపెట్టారని అన్నారు కేసీఆర్. కానీ.. అందుకు విరుద్ధంగా నేడు తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలిచిందని అన్నారు. భూముల రేట్లు పెరగడం దానికి సాక్ష్యమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలకు, హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రబత్వం చేసిన కృషికి దక్కిన ఫలితమని సీఎం కేసీఆర్ అన్నారు. చాలా మంది రాష్ట్రానికి, ప్రజలకు నష్టం చేకూర్చాలని చూసినా.. అహర్నిషలు పోరాడి ఈ ఫలితాలను దక్కించుకున్నామని కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కృషిచేస్తున్న హెచ్‌ఎండీఏ అధికారులు, మంత్రి కేటీఆర్, హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్, ఎంఏయూడీ ప్రత్యేక కార్యదర్శికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఇలాగే ముందుకు కొనసాగాలని అన్నారు.