తెలంగాణలో విస్తృతంగా 108, అమ్మఒడి ఉచిత వాహన సేవలు

మరిన్ని 108 అంబులెన్స్‌లు, అమ్మ ఒడి వాహనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

By Srikanth Gundamalla  Published on  1 Aug 2023 2:30 PM IST
CM KCR, Green Flag, 108 Ambulance, 204 Vehicles,

తెలంగాణలో విస్తృతంగా 108, అమ్మఒడి ఉచిత వాహన సేవలు 

తెలంగాణలో అత్యవసర సేవలు మరింత విస్తరించింది ప్రభుత్వం. మరిన్ని 108 అంబులెన్స్‌లు, అమ్మ ఒడి వాహనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. వీటిలో 204 కొత్త 108 అంబులెన్స్‌లు, 228 అమ్మ ఒడి వాహనాలు, 34 పరమపద వాహనాలు ఉన్నాయి.

హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో ఈ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపి వాహనాలను ప్రారభించారు. అయితే.. వాహనాలను ప్రారంభించిన వెంటనే సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ప్రతి లక్ష జనాభాకు ఒక అంబులెన్స్‌ ఉండేది.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 75 వేల మందికి ఒక అంబులెన్స్‌ను ఏర్పాటు చేసింది. 2014లో 321 అంబులెన్స్‌లు ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 455కి చేర్చింది రాష్ట్ర ప్రభుత్వం. 108 అత్యవసర అంబులెన్స్ ప్రతిస్పందన సమయం కూడా తగ్గింది. దాదాపు 30 నిమిషాల నుంచి 15 నిమిషాలకు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక అత్యవసర 108 అంబులెన్స్‌లు 2014లో లేవు.. కానీ ప్రభుత్వం ప్రభుత్వం జిల్లాకు ఒకటి 108 ప్రత్యేక అంబులెన్స్‌లను అందించింది.

నవజాత శిశువులకు జిల్లాకు ఒకటి చొప్పున అంబులెన్స్‌లను ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్రం ఏర్పడక ముందు ఒక్క అంబులెన్స్‌ కూడా ఉండేది కాదు. జీపీఎస్, ఎండీటీ ద్వారా ప్రస్తుతం నిరంతర పర్యవేక్షణ జరుగుతోంది. ఈ అంబులెన్స్‌ ద్వారా ప్రతిరోజు 2వేల ఎమర్జెన్సీ కేసులకు సేవలు అందనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గణాంకాల ప్రకారం ఇప్పటి దాకా 44.60 లక్షల మందికి సేవలు అందినట్లు తెలుస్తుంది. అమ్మఒడి వాహనాలు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు లేవు. కేసీఆర్ కిట్‌లో భాగంగా ప్రభుత్వం 300 వాహనాలను ఏర్పాటు చేసింది. ప్రతిరోజు 4వేల మంది గర్భిణిలకు ఈ అంబులెన్స్‌ సేవలు అందిస్తోంది. గతంలో పరమపద వాహనాలు కూడా లేవు. రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర వ్యాప్తంగా 50 వాహనాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 74వేల మరణాలకు సేవలు అందినట్లు ప్రభుత్వం చెబుతోంది.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు.. కరోనా కాదు దాని తాత వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ వైద్యారోగ్యశాఖ అన్ని విధాలా పటిష్టంగా ఉందని తెలిపారు. నియోజకవర్గానికి 100 పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేసేలా సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. జిల్లాలకు మెడికల్ కాలేజ్‌లు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Next Story