ధరణి పోర్టల్‌లో గోల్‌మాల్‌కు ఆస్కారం లేదు: సీఎం కేసీఆర్
ఈ నెల 30న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 13 Nov 2023 9:57 AM GMTధరణి పోర్టల్‌లో గోల్‌మాల్‌కు ఆస్కారం లేదు: సీఎం కేసీఆర్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. ఈ నెల 30న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. వరుసగా సభలు, సమావేశాలు.. ర్యాలీలు నిర్వహిస్తూ ఓటర్ల వద్దకు వెళ్తున్నారు నాయకులు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూడా సుడిగాలి పర్యటనతో ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. రైతులు, పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. దేశంలో మరెక్కడా 24 గంటల ఉచిత కరెంటు అందించడం లేదని చెప్పారు. అలాగే రాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటిని అందిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలు వస్తూ ఉంటాయ్.. పోతూ ఉంటాయ్ కానీ ప్రజలు మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. అభ్యర్థుల మంచి, చెడుతో పాటు గుణం గురించి కూడా ఆలోచించాలన్నారు. అభ్యర్థుల వెనుక పార్టీలు ఉంటాయని.. వాటి చరిత్ర, నడవడిక, అధికారం ఇస్తే ఏం చేస్తారు ఇలా అన్నింటినీ బీరేజు వేసుకుని ఓటు వేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. అప్పుడు నాయకుడు గెలవడం కంటే ముందు ప్రజలు గెలుస్తారని చెప్పారు.
తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ అని సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. అప్పుడు ఉద్యమాలను అణచివేసింది ఎవరు అని ప్రశ్నించారు. 2044లో రావాల్సిన తెలంగాణ ఆలస్యంగా ఏర్పడిందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన మొదట్లో రాష్ట్రంలో కరెంటు సమస్యలు ఉండేవని.. కానీ ఇప్పుడు అలాంటివి లేవన్నారు. కులం, మతం బేధాలు లేకుండా అందర్నీ సమానంగా చూస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. గోదావరిపై సీతారామ ప్రాజెక్టు కట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీరు ఇవ్వొచ్చనే ఆలోచన కాంగ్రెస్ చేయలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందనీ.. 70 శాతం పనులు కూడా పూర్తయ్యాయి అని చెప్పారు. అలాగే ధరణి గురించి కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. ధరణి పోర్టల్‌లో గోల్‌మాల్‌కు ఆస్కార లేదని స్పష్టం చేశారు. రైతుల పట్ల సానుభూతి లేని కాంగ్రెస్.. దాన్ని తీసేందుకు కుట్రలు చేస్తున్నాయన్నారు. ఒక వేళ ధరణిని తీసేస్తే రైతుబంధు సహా ఇతర పరిహాలు ఎలా అందుతాయని ప్రశ్నిస్తే.. కాంగ్రెస్ సమాధానం చెప్పడం లేదన్నారు సీఎం కేసీఆర్.