Telangana: స్కూళ్లలో చంద్రయాన్‌-3 సేఫ్‌ ల్యాండింగ్‌ లైవ్‌

అపూర్వ ఘట్టాన్ని అందరూ చూడాలని తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

By Srikanth Gundamalla  Published on  22 Aug 2023 1:32 PM IST
Chandrayaan-3, landing live, Telangana Schools,

Telangana: స్కూళ్లలో చంద్రయాన్‌-3 సేఫ్‌ ల్యాండింగ్‌ లైవ్‌

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రయోగం ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. అంతా సాఫీగా జరిగితే బుధవారం సాయంత్ర అంటే ఆగస్టు 23న సాయంత్రం చంద్రయాన్‌-3 సేఫ్‌గా ల్యాండ్‌ అవ్వనుంది. ప్రయోగం విజయవంతం అయ్యేందుకు ఇస్రో కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. చంద్రయాన్‌-3 ప్రయోగం ఫైనల్‌ స్టేజ్‌ విజయవంతం కావాలని యావత్‌ భారత్‌ కోరుకుంటోంది. ఇతర దేశాలు కూడా ఈ ప్రయోగం సక్సెస్‌ అవ్వాలని ఆశిస్తున్నాయి. చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఇలాంటి అపూర్వ ఘట్టాన్ని అందరూ చూడాలని తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చంద్రయాన్‌-3 సేఫ్‌ ల్యాండింగ్‌ లైవ్‌ను విద్యార్థులు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులకు ఇలాంటివి చూపించడం మంచిదని.. సైన్స్‌ పట్ల అవగాహన, ఆసక్తి పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందు కోసం ప్రభుత్వ స్కూళ్లు, విద్యాసంస్థల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తుననారు. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ డీఈవోలు, ప్రిన్సిపల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు.

అయితే.. చంద్రయాన్‌-3 ఆగస్టు 23న సాయంత్రం 5:30 గంటలకు సేఫ్‌గా ల్యాండ్‌ అవుతుందని ఇప్పటికే ఇస్రో ప్రకటించింది. దీనికి విద్యార్థులు, యువత ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూడాలని కోరింది. చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని టీశాట్, నిపుణలో అందించనున్నారు ఇస్రో అధికారులు. ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక తెరలు, ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసి విద్యార్థులంతా చూసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణవిద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story