కారును పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించొద్దు: బీఆర్ఎస్
ఎన్నికల్లో గుర్తు వివాదంపై బీఆర్‌ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
By Srikanth Gundamalla Published on 12 Oct 2023 10:37 AM ISTకారును పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించొద్దు: బీఆర్ఎస్
ఎన్నికల గుర్తు వివాదంపై బీఆర్‌ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కారును పోలిన గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ నుంచి తొలగించాలని కోరుతూ బీఆర్‌ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టును కోరింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ బుధవారం ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. కారుని పోలిన రోడ్డు రోలర్ వంటి గుర్తుల వల్ల ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు నష్టం కలుగుతోందని బీఆర్ఎస్ తన పిటిషన్‌లో పేర్కొంది. కాగా.. గురువారం ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.
గతంలో ఇలాంటి విజ్ఞప్ంతి చేయడంతోనే అప్పటి టీఆర్ఎస్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం 2011లో రోడ్డు రోలర్ గుర్తును తొలగించింది. కానీ.. తాజాగా రోడ్డు రోలర్ గుర్తును ఎన్నికల సంఘం ఓపెన్ గుర్తుల కేటగిరీలో చేర్చింది. దాంతో.. బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ గుర్తును ఫ్రీ సింబల్స్ నుంచి తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. స్వతంత్ర అభ్యర్థులు, ఎన్నికల సంఘం గుర్తింపు పొందని పార్టీలకు కేటాయించే ఎన్నికల గుర్తుల్లో కారు గుర్తును పోలిన వాటిని కేటాయించకూడదని కోరింది. రోడ్ రోలర్ గుర్తుతో పాటు కెమెరా, చపాతి రోలర్, సోప్‌డిష్, టెలివిజన్, కుట్టుమిషన్, ఓడ, ఆటో రిక్షా, ట్రక్ వంటి గుర్తులు ఈవీఎంలలో కారు గుర్తునే పోలినట్లు ఉన్నాయని వాటిని రాబోయే ఎన్నికల్లో ఎవరికీ కేటాయించొద్దని ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. దాంతో.. బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తమ విజ్ఞప్తి మేరకు ఆయా గుర్తులను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో బీఆర్ఎస్ పేర్కొంది.
గతంలో జరిగిన ఎన్నికల్లో జాతీయ పార్టీలకంటే ఎక్కువ ఓట్లు రోడ్డు రోలర్ గుర్తుకు పడ్డాయని కొన్ని ఉదాహరణలను ఉటంకించారు బీఆర్ఎస్ నాయకులు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కంప్లైంట్ చేసిన అంశాన్ని తాజాగా గుర్తుచేశారు. రెండు వారాల వ్యవధిలో రోడ్డు రోలర్ గుర్తుపై తాము లేవనెత్తిన అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుని తుది ఉత్తర్వులను ఇవ్వాలని బీఆర్ఎస్ కోరింది.