షర్మిలకు బిగ్‌షాక్.. YSRTPకి నేతల మూకుమ్మడి రాజీనామా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ షర్మిలకు బిగ్ షాక్ తగిలింది.
By Srikanth Gundamalla Published on 7 Nov 2023 10:15 AM GMTషర్మిలకు బిగ్‌షాక్.. YSRTPకి నేతల మూకుమ్మడి రాజీనామా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ షర్మిలకు బిగ్ షాక్ తగిలింది. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీకి పలువురు నేతలు మూకుమ్మడి రాజీనామా చేశారు. అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ దూరంగా ఉంటున్నట్లు షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు తాము కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అయితే.. ఈ నిర్ణయంపై పలువురు వైఎస్‌ఆర్‌టీపీ నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దాంతో.. మూకుమ్మడి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల వేళ షర్మిలకు ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది.
హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో గట్టు రామచంద్రరావు నేతృత్వంలో వైఎస్‌ఆర్‌టీపీకి పలువురు నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్ షర్మిల తెలంగాణలో రాజన్న పాలనే తేవాలనే లక్ష్యంగా వైఎస్‌ఆర్‌టీపీని స్థాపించింది. కానీ.. ఆ తర్వాత అనూహ్య పరిణామాలతో కాంగ్రెస్ నేతలు ఆమె పార్టీని విలీనం చేయాలని చర్చలు జరిపారు. దాంతో.. షర్మిల కూడా అందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలిసిందే. అంతేకాదు.. కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి పలుమార్లు చర్చలు కూడా జరిపింది. కానీ.. అంతలోనే ఎన్నికలు రావడంతో విలీనానికి బ్రేక్ పడింది. తాజాగా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నామని.. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించింది.
వైఎస్ షర్మిల నిర్ణయాన్ని పలువురు నేతలు వ్యతిరేకించారు. దాంతో.. వైఎస్‌ఆర్‌టీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్ర షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన గట్టు రామచంద్రరావు.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరును షర్మిల చెడగొట్టారంటూ విమర్శలు చేశారు. కాంగ్రెస్‌లో నిలబడతా అని చివరగా అందరినీ రోడ్డుమీదకు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు షర్మిలను సపోర్ట్ చేసినందుకు గట్టు రామచంద్రరావు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబున్నానన్నారు. తామంతా షర్మిలను తెలంగాణ నుంచి బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలంటే షర్మిలకు చిన్నచూపు అనీ.. రాజకీయాలకు సరిపోరంటూ విమర్శలు చేశారు. అయితే.. త్వరలోనే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని గట్టు రామచంద్రరావు వెల్లడించారు.
మహిళలకు ప్రాధాన్యత ఇస్తామంటేనే పార్టీలో చేరామని.. కానీ అలా లేదన్నారు సత్యవతి. షర్మిల ఎవరినీ గౌరవించలేదని.. సొంత అజెండాతో ముందుకు వెళ్లిందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో షర్మిల ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామని చెప్పారు సత్యవతి. తెలంగాణ సొమ్మును దోచుకోవడానికి షర్మిల వచ్చిందంటూ పలువురు నేతలు మండిపడ్డారు. ఎన్నో డ్రామాలు చేశారని.. తెలంగాణ ద్రోహి షర్మిలకు సరైన గుణపాఠం చెప్తామని వైఎస్‌ఆర్‌టీపీకి రాజీనామా చేసిన నేతలు అన్నారు.