కరీంనగర్‌లో రోడ్లపై ఎలుగుబంటి సంచారం..భయాందోళనలో ప్రజలు
కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టిస్తోంది.
By Srikanth Gundamalla Published on 12 Aug 2023 7:00 AM GMTకరీంనగర్‌లో రోడ్లపై ఎలుగుబంటి సంచారం..భయాందోళనలో ప్రజలు
కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టిస్తోంది. వేరువేరు ప్రాంతాల్లో ఎలుగుబంటి సంచరించిన వీడియో స్థానిక జనాలు భయపడేలా చేస్తోంది.
కరీంనగర్-జగిత్యాల హైవే దగ్గర ఆగస్టు 11న మధ్యాహ్నం సమయంలో ఎలుగుబంటి సంచరించింది. ఒక్కసారిగా ఎలుగుబంటి రోడ్డుమీదకు రావడంతో జనాలంతా భయపడిపోయారు. ప్రజలు గట్టిగా అరుస్తూ ఎలుగుబంటి ఎక్కడ దాడి చేస్తుందో అన్న భయంతో పరుగులు తీశారు. దాంతో.. ఎలుగుబంటి కూడా బెదిరిపోయి రోడ్లపై ఎటువెళ్లాలో తెలియక పరుగులు తీసింది. అక్కడే ఉన్న కొందరు స్థానికులు ఎలుగుబంటి రోడ్లపై తిరుగుతున్న ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. రోడ్లపై అటుఇటూ తిరుగుతూ పారిపోయేందుకు ఎలుగుబంటి ప్రయత్నం చేసింది. కొందరైతే ఎలుగుబంటిని తరిమేందుకు దాని వెనకాలే పరిగెత్తారు.
ఇక ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. పోలీసులు అక్కడికి చేరుకునే సరికి ఎలుగబంటి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దాంతో.. ప్రస్తుతం గండం తప్పడంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఎలుగుబంటి ఎక్కడి నుంచి వచ్చింది..? ఎక్కడికి వెళ్లిపోయిందని పోలీసులు దర్యాప్తు చేశారు. అందులో భాగంగానే పలు సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. దాంతో.. కరీంనగర్ జిల్లాలోని బొమ్మకల్ గ్రామ పరిధిలో కూడా రాత్రి ఎలుగుబంటి సంచరించినట్లు తేలింది. కాలనీలో సీసీరోడ్లపై తిరుగుతూ కనిపించింది. దాంతో.. పోలీసులు స్థానికంగా ఉన్న పలు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.
రాత్రి వేళ, ఒంటరిగా బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ఎలుగుబంటి తిరుగుతున్న సమాచారం అటవీశాఖ అధికారులకు అందజేశారు. ప్రస్తుతం ఎలుగుబంటి ఎక్కడ ఉందో గుర్తించేందకు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. బొమ్మకల్ సహా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు.