ఖమ్మంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుకి నిరసన సెగ
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకి ఖమ్మం పట్టణంలో చేదు అనుభవం ఎదురైంది.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 2:23 PM ISTఖమ్మంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుకి నిరసన సెగ
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకి ఖమ్మం పట్టణంలో చేదు అనుభవం ఎదురైంది. ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు ఖమ్మం వచ్చారు మంత్రి అంబటి రాంబాబు. అయితే.. ఈ విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు భారీగా రోడ్డుపైకి చేరుకున్నారు. అంబటి రాంబాబు గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఖమ్మం పట్టణంలో ఓ ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకి నిరసన సెగ తగలింది. ఖమ్మంలో ఉన్న గ్రాండ్ గాయత్రి హోటల్‌లో మంత్రి అంబటి బస చేశారు. అయితే.. అంబటి రాంబాబు ఖమ్మం వచ్చిన విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హోటల్ వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఆందోళన చేపట్టారు. సీఎం జగన్, మంత్రి అంబటి రాంబాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం జగన్ డౌన్‌డౌన్.. అంబటి రాంబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఖమ్మం గడ్డ టీడీపీ అడ్డా.. ఇక్కడి నువ్వెందుకొచ్చావ్ అంటూ అంబటి రాంబాబుని ఖమ్మం టీడీపీ నాయకులు ప్రశ్నిస్తూ ఆందోళన చేశారు.
టీడీపీ నాయకుల ఆందోళనతో మంత్రి అంబటి రాంబాబు అలర్ట్ అయ్యారు. అక్కడి నుంచి కారు ఎక్కి వెళ్లిపోయేందుకు ప్రయత్నం చేశారు. అయితే.. నిరసన.. నినాదాలతో ఊరుకోని టీడీపీ నాయకులు మంత్రి అంబటి రాంబాబు కారుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కారు ముందుకు కదలనీయకుండా జై చంద్రబాబు అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. స్థానిక టీడీపీ నాయకులు, పార్టీ శ్రేణులతో ఖమ్మం నగరంలో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఖమ్మం పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. చివరకు మంత్రి అంబటి రాంబాబు కారు వెళ్లేందుకు మార్గం సుగమం కావడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత మంత్రి అంబటి పర్యటనకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మంత్రి అంబటి రాంబాబు ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిపోయారు.