Mulugu: అంబులెన్స్‌ బురదలో చిక్కుకుని గర్భంలోనే శిశువు మృతి

మిచౌంగ్‌ తుపాను కారణంగా ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి.

By Srikanth Gundamalla  Published on  7 Dec 2023 4:01 AM GMT
Ambulance, stucked, mud,  baby died,

Mulugu: అంబులెన్స్‌ బురదలో చిక్కుకుని గర్భంలోనే శిశువు మృతి

మిచౌంగ్‌ తుపాను కారణంగా ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. ఈ క్రమంలో కొన్ని గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే.. మిచౌంగ్ తుపాను ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌లో తరలిస్తుండగా.. ఆ వాహనం వర్షాల కారణంగా ఏర్పడ్డ బురదలో చిక్కుకుంది. ఆమెను ఆస్పత్రికి తరలించడం ఆలస్యం కావడంతో తల్లి గర్భంలోనే శిశువు ప్రాణాలు కోల్పోయింది.

ఈ విషాద సంఘటన ములుగు జిల్లాలోని కోయగూడ మండలం ఎల్లాపూర్‌లో చోటుచేసుకుంది. తుపాను కారణంగా రోడ్లన్నీ బురదతో చిత్తడిగా మారాయి. అయితే.. ఎల్లాపూర్‌ గ్రామానికి చెందిన రమ్య అనే మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అయితే.. వెంటనే స్పందించిన 108 సిబ్బంది కూడా గ్రామానికి చేరుకున్నారు. గర్భిణిని ఎక్కించుకుని ఆస్పత్రికి తరలించేందుకు బయల్దేరారు. రాంనగర్‌ నుంచి కమలాపురం వెళ్లే దారిలో వర్షం కారణంగా రోడ్డుపై పూర్తిగా బురద కూరుకుంది.

బురద లోతు తెలియని అంబులెన్స్ డ్రైవర్‌ అలాగే ముందుకు వెళ్లాడు. అనుకోకుండా బురదలో అంబులెన్స్‌ చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా వాహనం ముందుకు కదల్లేదు. ఈ సమాచారం తెలుసుకున్న స్తానికులు కొందరు ట్రాక్టర్‌ను తీసుకొచ్చి.. బురదలో నుంచి అంబులెన్స్‌ను బయటకు లాగారు. ఆ తర్వాత గర్భిణిని ఆస్పత్రిలో చేర్చారు. రమ్యకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. శిశువు తల్లి కడుపులోనే మరణించిందన్న చేదు వార్తను చెప్పారు. గర్భిణిని ఆస్పత్రికి తీసుకురావడంలో ఆలస్యం అయ్యిందని వెల్లడించారు. కడుపులోకి శిశువు ఉమ్మనీరు మింగి ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు నిర్ధారించారు. పుట్టకుండానే బిడ్డ మరణించడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ సంఘటన రమ్య కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మరోవైపు రెండేళ్లుగా రోడ్ల నిర్మాణం పనుల్లో జాప్యం చేస్తున్నారంటూ ప్రభుత్వ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story