ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీకి ఆ కార్డు పనిచేయదు: సజ్జనార్
సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా సొంత గ్రామాలకు పయనం కానున్నారు.
By Srikanth Gundamalla Published on 8 Jan 2024 2:55 PM ISTTelangana: ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీకి ఆ కార్డు పనిచేయదు: సజ్జనార్
సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా సొంత గ్రామాలకు పయనం కానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ సంస్థ పలు కీలక సూచనలు చేసింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. అయితే.. మహిళలకు ఫ్రీ జర్నీ పథకంలో పలు సమస్యలు ఆర్టీసీ అధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పలు సూచనలు చేశారు.
సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఎక్కువ కానున్న సందర్భంగా.. ఆర్టీసీ సంస్థ తాజాగా ఈ సూచనలు చేసింది. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకునే మహిళలు ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా చూపించాలని చెప్పారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డు అయినా ఈ పథకానికి వర్తిస్తుందని తెలిపారు. ఇక పాన్ కార్డు మాత్రం ఫ్రీ జర్నీ కోసం అనుమతించమని చెప్పారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. పాన్ కార్డులో అడ్రస్ ఉండదనీ.. అందుకే ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని చెప్పారు.
అయితే.. ఇటీవల ఆర్టీసీ సిబ్బందితో పలువురు మహిళా ప్రయాణికులు గొడవపడ్డ విషయాలు యాజమాన్యం దృష్టికి వెళ్లింది. కొందరు జీరాక్స్‌లు.. ఇంకొందరు ఫొటో కాపీలు.. ఫోన్లలో చూపిస్తున్నారనీ తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనివల్ల సిబ్బందికి ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోందని చెప్పారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఫలితంగా ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని చెప్పారు. ఈ మేరకు మహిళా ప్రయాణికులంతా ఒరిజినల్ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్‌ను కచ్చితంగా తీసుకోవాలని సజ్జనార్ కోరారు. ఒకవేళ ఒరిజినల్ కార్డులేకపోతే డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకు మాత్రమే వర్తిస్తుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు.
ఇక మరికొందరు మహిళా ప్రయాణికులు ఎలాగూ ఫ్రీ జర్నీనే కదా.. జీరో టికెట్ కూడా అవసరం లేదన్నట్లుగా మాట్లాడుతున్ననీ చెప్పారు. ఇది ఏమాత్రం సరికాదని చెప్పారు సజ్జనార్. జీరో టికెట్ తీసుకోవడం ద్వారానే ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వం నుంచి రీయింబర్స్ చేస్తుందని చెప్పారు. జీరో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే సంస్థకు నష్టం చేసినవాళ్లవుతారని చెప్పారు. కాబట్టి ప్రతీ మహిళా జీరో టికెట్ తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు.
మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి! "మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం" వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డైన ఈ… pic.twitter.com/7WGyTPfqDE
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) January 8, 2024