Vikarabad: చెరువులోకి దూసుకెళ్లిన కారు, ఒకరు గల్లంతు

వికారాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కారు ఒక్కసారిగా చెరువులోకి దూసుకెళ్లింది.

By Srikanth Gundamalla  Published on  25 Dec 2023 6:58 AM GMT
car,  pond,  one person missing, vikarabad,

Vikarabad: చెరువులోకి దూసుకెళ్లిన కారు, ఒకరు గల్లంతు  

వికారాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులు అనంతగిరి హిల్స్ చూసేందుకు కారులో బయల్దేరారు. మార్గమధ్యలో కారు ఒక్కసారిగా చెరువులోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో నలుగురు క్షేమంగా బయటపడగా.. మరొకరు గల్లంతు అయ్యారు.

చలికాలంలో అనంతగిరిహిల్స్‌ వద్ద వాతావరణం బావుటుంది. విపరీతంగా కురిసే మంచుని చూసేందుకు చాలా మంది వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఐదుగురు స్నేహితులు కూడా అలాగే తెల్లవారుజామున బయల్దేరారు. హైదరాబాద్‌ నుంచి తెల్లవారుజామున 3 గంటలకే అనంతగిరి హిల్స్‌కు బయల్దేరారు. ఐదుగురిలో నలుగురు అబ్బాయిలు కాగా.. ఒక అమ్మాయి ఉంది. రఘు, మోహన్, సాగర్‌, గుణశేఖర్‌తో పాటు పూజిత అనే అమ్మాయి కారులో అనంతగిరి హిల్స్‌కు బయల్దేరారు. అయితే.. శివారిరెడ్డిపేట దగ్గరకు వెళ్లగానే కారు ఒక్కసారిగా రోడ్డుపక్కకే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఐదుగురిలో రఘుకి ఈత రావడంతో.. సాగర్‌, మోహన్, పూజితలను సురక్షితంగా తీసుకొచ్చాడు. కానీ.. గుణశేఖర్‌ కారుతో సహా నీటిలో మునిగిపోయాడు.

క్షేమంగా బయటకు వచ్చిన వారు ఇతర వాహనదారుల సాయంతో పోలీసులకు సమాచారం అందించారు. దాంతో.. పోలీసులు కూడా వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. చెరువులో మునిగిన కారును బయటకు తీశారు. గల్లంతైన వ్యక్తి ఇంకా తెలియలేదని.. గజ ఈతగాళ్లతో గాలింపు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. కాగా.. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. కారుకి ఇరువైపులా డ్యామేజ్‌ అయ్యి ఉందని పోలీసులు చెబుతున్నారు. వేరే ఏదైనా వాహనం కారుని ఢీకొట్టడం వల్ల చెరువులోకి దూసుకెళ్లిందా? లేదంటే మంచు విపరీతంగా ఉన్న కారణంగా రోడ్డు సరిగ్గా కనబడకపోవడంతో కారులో చెరువులోకి దూసుకెళ్లిందా? అనేది తెలియాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. వింటర్‌ సీజన్‌లో అనంతగిరికి చాలా మంది జనాలు వస్తూ ఉంటారనీ.. ఎక్కువగా వేకువజామునే వస్తుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ.. పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు చెబుతామని వెల్లడించారు.



Next Story