పెద్దపల్లిలో వరదలో చిక్కుకున్న 10 మంది, కొనసాగుతున్న రెస్క్యూ
పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని గోపాల్‌పూర్ ఇసుక క్వారీలో 10 మంది వ్యక్తులు చిక్కుకుపోయారు.
By Srikanth Gundamalla
పెద్దపల్లిలో వరదలో చిక్కుకున్న 10 మంది, కొనసాగుతున్న రెస్క్యూ
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో.. వరదలు సంభవిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్నిచోట్ల అయితే వరద ఎక్కువగా ఉండి రాకపోకలకు అంతరాయం కూడా కలుగుతోంది. ఈ క్రమంలో అధికారులు పలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవసరం అయితే తప్ప బయటకు రావొద్దని చెబుతున్నారు. వరద ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియదు..వాగులను దాటడం ప్రమాదకరం అని చెబుతున్నారు. అయితే.. ఈ క్రమంలోనే 10 మంది వరదలో చిక్కుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం వారు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని భయపడిపోతున్నారు.
పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని గోపాల్‌పూర్ ఇసుక క్వారీలో 10 మంది వ్యక్తులు చిక్కుకుపోయారు. విధి నిర్వహణలో భాగంగా రోజూలాగే 10 మంది కార్మికులు ఇసుక క్వారీలోకి వెళ్లారు. పని చేసుకుంటుండగా మన్నేరు వాగులో అకస్మాత్తుగా వరద వచ్చింది. ఎటూ వెళ్లకుండా అందరినీ చుట్టేసింది. ఏం చేయాలో తెలియక అక్కడే ఉండిపోయారు. ఇక సమాచారం అందుకున్న గ్రామస్తులు పోలీసులకు పరిస్థితిని తెలియజేశారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకున్నారు. ఇసుక క్వారీలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఇదిలా ఉండగా మరోవైపు జనగాం జిల్లాలోని చిలుకూరు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ చుట్టూ వరద నీరు చేరుకోవడంతో సబ్ స్టేషన్ లో పనిచేస్తున్న ఆపరేటర్ అందులోనే ఉండిపోయాడు. ఒంటరిగా ఉన్న అతను సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. విషయం తెలుసుకున్న వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారాన్ని అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇలా పలుచోట్ల వరదల్లో చిక్కుకుంటున్నారు ప్రజలు. కావున జాగ్రత్తలు వహించాలని.. వాగుల్లోకి వెళ్లొద్దని చెబుతున్నారు అధికారులు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని సూచిస్తున్నారు.