“తాగుతా నీయబ్బ తాగుతా” అంటున్న తెలంగాణ

By Newsmeter.Network  Published on  23 Dec 2019 6:08 AM GMT
“తాగుతా నీయబ్బ తాగుతా” అంటున్న తెలంగాణ

మన దేశభక్త పన్ను చెల్లింపుదారులైన మందు భాయిలకు, ఎక్సైజ్ అధికారులకు చెవిలో తేనె పోసినంత మంచి వార్త ఇది. మిగతా విషయాల్లో అయినా కాకపోయినా, మందు విషయంలో మాత్రం మనది బంగారు తెలంగాణ అయిపోయింది. గ్లాసుల గలగల పుణ్యమా అని కాసుల కళకళ మన ప్రభుత్వానికి కనిపిస్తోంది. దేశమంతటా 16.7 శాతం మందు తాగుతూంటే, మన తెలంగాణ మాత్రం జాతీయ సగటును దాటేసి 16.8 శాతానికి చేరుకుంది.

కేంద్ర ప్రభుత్వంలోని సామాజిక న్యాయం, మాదకద్రవ్యాల అలవాటున్నవారికి చికిత్స చేసే జాతీయ కేంద్రం, ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్ టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లు కలిసి తాజాగా చేసిన సర్వేలో మన రాష్ట్రంలో 30 శాతం మంది ప్రజలు మద్యం తాగుతున్నట్టు తేలింది. మన రాష్ట్రంలో ఈ సర్వేలో మానసిక వ్యాధుల చికిత్స చేసే ఎర్రగడ్డ ఆస్పత్రికి చెందిన సైకియాట్రిస్టులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 11.7 శాతం మంది, తెలంగాణలో 30.4 శాతం మంది మద్య పానం చేస్తారని వెల్లడైంది. దేశ వ్యాప్తంగా 14 కోట్ల మంది మందు భాయిలకు తక్షణం పునరావాస చికిత్స అవసరం. అందులో 47 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు.

అయిత మన తెలంగాణలో కేవలం మగాళ్లే మందు కొడుతున్నారనుకుంటే పొరబాటే. మహిళలు కూడా బాటిలెత్తితే ఖాళీ అయ్యేదాకా దింపడం లేదట. ఈ సంఖ్య క్రమేపీ పెరుగుతోందట కూడా. 18 ఏళ్లకు పైబడిన వారిలో మందుతాగేవారిలో పురుషపుంగవులు 27. 3 శాతం అయితే నారీమణులు 1.6 శాతం అట. ప్రతి అయిదుగురు మగాళ్లలో ఒకరు మందుకొడితే, ప్రతి 16 మందిలో ఒక మహిళ మందు తాగుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో పది శాతం మంది మందుభాయిలు, ఛత్తీస్ గఢ్, పంజాబ్, అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్ లలో ఆల్కహాల్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. త్రిపురలో 20.2 శాతం మందికి ఆల్కహాలిజం ఉందని అధ్యయనం చెబుతోంది.

Next Story