తెలంగాణ ఆర్టీసీ డిపోల వద్ద సందడి!

By Newsmeter.Network  Published on  29 Nov 2019 6:09 AM GMT
తెలంగాణ ఆర్టీసీ డిపోల వద్ద సందడి!

ముఖ్యాంశాలు

  • సంతోషం వ్యక్తం చేస్తున్న కార్మికులు
  • కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం
  • విధుల్లోకి చేరుతున్న కార్మికులు

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల 52 రోజుల సమ్మె తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా డిపోల వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించడంతో కార్మికుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ రోజు ఉదయం నుంచి కార్మికులు విధుల్లో చేరేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల డిపోల వద్ద బారులు తీరారు. కార్మికులంతా ఎలాంటి షరతుల్లేకుండా విధుల్లో చేరవచ్చంటూ ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో వారంతా ఉదయం నుంచే డిపోలకు చేరుకుంటున్నారు. షరతుల్లేకుండా విధుల్లోకి తీసుకోవడం సంతోషకరమని, సంస్థను అభివృద్ధి బాటలో నడిపించేందుకు కృషి చేస్తామని వారంటున్నారు. సమ్మెలో అమరులైన కార్మికులను నివాళులర్పించి విధుల్లో చేరుతున్నారు. అలాగే కొందరు కార్మికులు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తున్నారు.

ఆర్టీసీ తమకు అమ్మలాంటిది:

ఆర్టీసీ తమకు అమ్మలాంటిదని.. అనునిత్యం కాపాడుకుంటామని కార్మికులుచెబుతున్నారు. కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం, మంచిర్యాలా, కరీంనగర్‌, వరంగల్‌ సహా అన్ని జిల్లాల్లోని వివిధ డిపోలకు చెందిన కార్మికులు విధుల్లోకి చేరేందుకు తరలివచ్చారు. ఇదిలా ఉండగా మెదక్ పట్టణంలో..ఉదయం 6:30 గంటలకు మెదక్ పట్టణ సీఐ వెంకటయ్య "అరెస్టు కాదు ఆహ్వానము" అంటూ విధుల్లోకి చేరుతున్న ఆర్టీసీ కార్మికులకు గులాబీ పువ్వులను ఇచ్చి స్వాగతం పలికినారు.

కార్యక్రమంలో టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి ఎం. రాధా కిషన్ రావు, 50 మంది వరకు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.

ఆర్టీసీకి వంద కోట్లు:

నిన్న మీడియాతో మాట్లాడిన కేసీఆర్‌....ఆర్టీసీకి రూ.100 కోట్ల తక్షణ ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. సంస్థ మనుగడ కోసం ప్రయాణికులపై భారం మోపారు. కిలోమీటరుకు 20 పైసల చొప్పున ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించారు. సోమవారం నుంచి ఇవి అమల్లోకి వస్తాయన్నారు. ఛార్జీల పెంపుదల ద్వారా రూ.760 కోట్ల అదనపు ఆదాయాన్ని అంచనా వేస్తున్నామని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. సమ్మెకాలంలో చనిపోయిన కార్మికులకు సంబంధించి వారి కుటుంబాల్లో ఒకరికి ఆర్టీసీలో గానీ, ప్రభుత్వంలో గానీ ఉద్యోగం ఇస్తామని భరోసా ఇచ్చారు. ఆర్టీసీని బాగు చేసేందుకు నాలుగైదు రోజుల్లో ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహిస్తామని, ఒక్కో డిపో నుంచి అయిదు నుంచి ఏడుగురిని ఆహ్వానిస్తామన్నారు. ఇందులో సంఘాలకు అవకాశం లేదని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి వేధింపులు లేకుండా ప్రతి డిపోలో ఇద్దరేసి కార్మికులతో సంక్షేమ మండలిని ఏర్పాటు చేస్తామన్నారు. సమ్మెకాలంలో పనిచేసిన తాత్కాలిక ఉద్యోగుల విషయంలోనూ సానుభూతితో వ్యవహరిస్తామని చెప్పారు.

Next Story
Share it