హైదరాబాద్: 14 జిల్లాల్లో భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం
By సుభాష్ Published on 29 Aug 2020 10:38 AM ISTతెలంగాణలో రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒడిస్సా, పరిసర ప్రాంతాలు, ఝార్ఖండ్ ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో పాటు రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టం 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ద్రోణి ఏర్పడిందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు మీడియాకు తెలిపారు. దాని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, మల్కాజిగిరి, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మహబూబాబాద్, వరంగల్, మెదక్, సిద్దిపేట, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
గత వారం పది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి సైతం భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువన నీటిని వదులుతున్నారు.