తెలంగాణ చరిత్రలోనే అత్యధిక కరెంటు వినియోగం..!

By రాణి  Published on  29 Feb 2020 12:53 PM GMT
తెలంగాణ చరిత్రలోనే అత్యధిక కరెంటు వినియోగం..!

తెలంగాణ రాష్ట్రంలో కరెంటు వినియోగం ఆకాశాన్ని తాకింది. ఎంతగా అంటే శుక్రవారం ఒక్క రోజే 13,168 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది..! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎప్పుడూ ఇలా విద్యుత్ డిమాండ్ ఏర్పడలేదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడినా ఏ ప్రాంతం లోనూ కరెంట్ కోత అన్నది లేకుండా చూసుకుంది విద్యుత్ శాఖ. 2014 మార్చి 23న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 13,162 మెగా వాట్ల గరిష్ట డిమాండ్ ఏర్పడింది.. ఇప్పుడు ఒక్క తెలంగాణ లోనే అంతకన్నా ఎక్కువగా కరెంటు వినియోగం ఏర్పడింది. రైతులకు 24 గంటల విద్యుత్ ప్రభుత్వం సరఫరా చేస్తుండడం, ఎత్తిపోతల పథకాల నిర్వహణ..కూడా ఇంత ఎత్తున విద్యుత్ వినియోగానికి కారణం అని అంటున్నారు విద్యుత్ శాఖ అధికారులు.

గత ఏడాది ఇదే రోజున 9,770 మెగా వాట్ల డిమాండ్ ఏర్పడగా ఇప్పుడు దాన్ని ఎంతగానో దాటిపోయింది. తెలంగాణ వచ్చినప్పటితో పోల్చుకుంటే ఏకంగా 132.6 శాతం అధికంగా డిమాండ్ ఏర్పడింది. దేశ వ్యాప్తంగా సగటు తలసరి విద్యుత్ వినియోగం 1,181 యూనిట్లు కాగా, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 1,896 యూనిట్లు ఉందంటే మనోళ్లు కరెంటు వినియోగాన్ని బాగా పెంచినట్లే.. తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి విద్యుత్ వినియోగం 1356 మెగా వాట్లు మాత్రమే..! తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మొత్తం విద్యుత్ కనెక్షన్లు 1,11,19,990 ఉంటే, నేడు రాష్ట్రంలో 1,54,14,451 కనెక్షన్ లు ఉన్నాయి.

2014లో తెలంగాణ రాష్ట్రంలో 47,338 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగగా 2018-19 సంవత్సరంలో 68,147 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగింది. తెలంగాణ ఏర్పడే సమయంలో 19,02,754 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా..ప్రస్తుతం 24,31,056 కు చేరుకున్నాయి. తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చిన సమయంలో మొదట వ్యవసాయానికి 9 గంటల పాటూ విద్యుత్ ను సరఫరా చేశారు.. ఇప్పుడు 24 గంటల పాటూ సరఫరా చేస్తున్నారు దీంతో రైతులకు మేలు జరగడమే కాకుండా విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. 2014 జూన్ 2 కు ముందు 2000 మెగా వాట్ల మించి వ్యవసాయ డిమాండ్ లేకపోయినా..ఇప్పుడు 6000 మెగావాట్ల వరకూ డిమాండ్ సాగుతోంది. భారీ నీటి పారుదల ప్రాజెక్టులకు పంపు హౌస్ ల కోసం 2200 మెగా వాట్ల విద్యుత్ అవసరం అవుతోందని అధికారులు చెప్పుకొచ్చారు. ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు తెలంగాణలో ఏర్పాటయ్యాయి. వాటికి నాణ్యమైన విద్యుత్ ను అందిస్తూ ఉండడం కరెంటు వినియోగం పెరగడానికి కారణమయ్యాయని అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని..ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్ శాఖ సమాయత్తమవుతోంది.

Next Story