అవును.. వీరిద్దరూ ఏమయ్యారు..?

By సుభాష్  Published on  16 Dec 2019 1:11 PM GMT
అవును.. వీరిద్దరూ ఏమయ్యారు..?

ముఖ్యాంశాలు

  • జాడపత్తా లేని ఇద్దరు నేతలు

  • గత ప్రభుత్వంలో కీలక పదవులు

  • ఐదేళ్లు చక్రం తిప్పిన వీరు.. ఇప్పుడేమయ్యారు..

తెలంగాణలో ఓ వెలుగు వెలిగిన ఇద్దరు నేతలు ఇప్పుడు సైలెంట్‌ అయ్యారు. వారి మౌనం వెనుక కారణం ఏమిటని రాజకీయవర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఈ ఇద్దరు నేతలు అదృష్టం బాగా లేక 2018 ఎన్నికల తర్వాత జనాల ముందు కనిపించకుండా పోయారు. ఐదేళ్లు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవీరు ఒక్క ఓటమితో వారిని కనుమరుగు చేసిందా ? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనే అనుమానాలు రాజకీయ నేతల్లో తలెత్తుతున్నాయి.

సిరికొండ మధుసూదనాచారి : 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ జట్టులో భూపాలపల్లి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. మంత్రి పదవికి కూడా పోటీ పడ్డారు. చివరకు సీఎం కేసీఆర్‌ కేసీఆర్ ఆయనకు అసెంబ్లీ స్పీకర్ పోస్టు కట్టబెట్టాడు. ఐదేళ్లు తన స్థానానికి తగ్గట్టుగా హుందాగానే నడుచుకుంటూ స్పీకర్‌ బాధ్యతలు మోశాడు. కానీ 2018 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆయనకు అదృష్టం వరించలేదు. ఆయనపై వ్యతిరేకమా..లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనే విషయం పక్కనబెడితే ప్రజలు తమ ఓటుతో దెబ్బకొట్టారు. ఆయనపై గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి.. ఆ తర్వాత పరిణామాలలో కారెక్కి గులాబీ కండువా కప్పుకొన్నాడు.

ఒక్క ఓటమితో కనుమరుగవడం ఏంటీ..?

మధుసూదనాచారి ఇప్పుడు రాజకీయాల్లో కనిపించకుండాపోవడంతో కారణం ఏమై ఉంటుందని, రాష్ట్రానికి స్పీకర్‌గా పని చేసిన వ్యక్తి ఒక్క ఓటమితోనే కనుమరుగవడం ఏంటి ? అనే ప్రశ్నలు రాజకీయ నేతల్లో తలెత్తుతున్నాయి. అప్పటికీ నియోజకవర్గంలో జన బలం అధికంగా ఉండి, డబ్బు, ఇతర వాటిలో పైచేయి కలిగిన 'గండ్ర వెంకటరమణారెడ్డి' పార్టీలో చేరడంతో మధుసూదనాచారి సైలెంటయ్యారనే వార్తలు వెలువడగా, మరో వైపు కేసీఆర్‌ జట్టులో ఓ వెలుగు వెలిగిన ఈయన రాజకీయపరంగా కనుమరుగయ్యేలా చేశారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మరోవైపు టిఎన్జీవోల సంఘం అధ్యక్షుని హోదాలో ఉండి, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న స్వామిగౌడ్ సైతం సైలెంట్‌గా ఉండటం కూడా కారణాలేమై ఉంటాయనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. 2014 ఎన్నికల అనంతరం స్వామిగౌడ్‌ శాసనమండలి ఛైర్మెన్ అయ్యారు. అటెండర్ స్థాయి నుంచి ఎదిగిన స్వామిగౌడ్‌ ..ఏకంగా తెలంగాణ శాసన మండలి ఛైర్మెన్‌ని చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్లుగా సాదాసీదాగా గడిచిన అనంతరం పరిణామాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. శాసనమండలి ఛైర్మెన్ పదవీ కాలం ముగిసిన తర్వాత స్వామిగౌడ్‌కు అ పదవీని పొడిగిస్తారని అందరు భావించారు. ఏమైందో ఏదో తెలియదు గానీ.. కేసీఆర్ ఆ పదవిని గుత్తా సుఖేందర్ రెడ్డికి అప్పగించారు. దాంతో తన భవిష్యత్ ఏమిటో తెలియక స్వామిగౌడ్ నిశబ్దంగా ఉండిపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఐదేళ్లలో కీలక స్థానాల్లో ఉన్నఇద్దరు ఇపుడు కనుమరుగు కావడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది.

Next Story