రానున్న రోజుల్లో తెలంగాణలో ‘బెంగాల్’ సీన్లు తప్పవా?

By సుభాష్  Published on  13 July 2020 7:37 AM GMT
రానున్న రోజుల్లో తెలంగాణలో ‘బెంగాల్’ సీన్లు తప్పవా?

దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నా.. కొన్ని రాష్ట్రాల్లో రాజకీయం మాత్రం భిన్నంగా ఉంటుంది. ఆ కోవలోకే వస్తుంది పశ్చిమబెంగాల్ రాష్ట్రం. అక్కడి రాజకీయాల తీరు రోటీన్ కు భిన్నం. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. అధికార బదిలీ అక్కడ అంత తేలిగ్గా సాగదు. ఎక్కడిదాకానో ఎందుకు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న మమతా బెనర్జీ వ్యవహారమే తీసుకోవచ్చు. తృణమూల్‌ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న ఆమె.. ముఖ్యమంత్రి కావటం వెనుక ఎంతో శ్రమించాల్సి వచ్చింది.

కమ్యునిస్టు పార్టీ కంచుకోటను బద్ధలు కొట్టటమే కాదు.. తృణమూల్‌ కాంగ్రెస్ కు తిరుగులేని రీతిలో బెంగాల్ లో పుంజుకునేలా చేసే ప్రక్రియలో ఎన్నో దాడులు.. ప్రతిదాడులు చోటు చేసుకున్నాయని చెప్పక తప్పదు. తాజాగా. బెంగాల్ మీద కన్నేసిన బీజేపీ.. గడిచిన కొన్నేళ్లుగా అలుపెరగని పోరాటాన్ని చేస్తూనే ఉంది. అయినప్పటికీ మమత పార్టీని దెబ్బ తీసే విషయంలో కమలనాథులకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.

ఆ మాటకు వస్తే.. వామపక్షాల ప్రభుత్వాన్ని దెబ్బ తీసే సమయంలోనూ మమత ఇలాంటి ప్రతికూల వాతావరణాన్నే ఎదుర్కొన్నారు. అయినప్పటికి వెనక్కి తగ్గకుండా మొండిగా చేసిన ప్రయత్నమే ఆమెను విజేతగా నిలపటమే కాదు. బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా మార్చారు. మమతను దెబ్బ తీసి.. రాష్ట్రంలో కాషాయజెండా ఎగురవేయాలని మోడీషాలు తపిస్తుంటారు. ఇందుకుతగ్గట్లే ప్రయత్నాలు చేసినా.. పెద్దగా ఫలించని పరిస్థితి. మరికొద్ది నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్అధికార పార్టీని ఏదోలా దెబ్బ తీసి.. అధికారాన్ని సొంతం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.

ఈ క్రమంలో రెండుపార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. విమర్శలు.. ఆరోపణలే కాదు.. దాడులు.. ప్రతి దాడులు సైతం చోటు చేసుకుంటున్నాయి. బెంగాల్ లో అధికార పక్షాన్ని ఎదిరించి పోరాటం చేయటం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితే తెలంగాణలోనూ ఉందని చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని అధిక్యతతో ఉండటమే కాదు.. వారిని కాదనే పరిస్థితి రాష్ట్రంలో లేదు. ఇలాంటి పరిస్థితిని మార్చాలని.. రాష్ట్రంలో తమ పార్టీ అధిక్యతను ప్రదర్శించాలన్నది కమలనాథుల ఆలోచన.

ఇటీవల కాలంలో పార్టీ అధ్యక్ష పదవిని ఫైర్ బ్రాండ్ చేతికి అప్పజెప్పటమే కాదు.. దూకుడుగా దూసుకెళ్లే బండి సంజయ్ కు అన్ని విధాలుగా సహకరిస్తూ.. పార్టీని విస్తరించే పనిలో బీజేపీ ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన టీఆర్ఎస్ నేతలు ఆ ప్రయత్నాలు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారు. తమను బద్నాం చేసి.. మైలేజీ పొందాలనుకునే బీజేపీకి ఎక్కడికక్కడ అడ్డుకోవాలన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలోనే వరంగల్ సీన్ చోటుచేసుకుందని చెప్పాలి. స్థానిక టీఆర్ఎస్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ అరవింద్ కాన్వాయ్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేయటాన్ని కమలనాథులు సీరియస్ గా తీసుకుంటున్నారు. బెంగాల్ తరహాలో తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కొంటే తప్పించి మనుగడ లేదన్న భావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. బెంగాల్ అధికార పక్షాన్ని ఏ రీతిలో అయితే ఎదుర్కొంటున్నామో.. సరిగ్గా అదే తీరును తెలంగాణలోనూ చేయాల్సిన అవసరం ఉందన్నట్లుగా పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే.. బెంగాల్ లో తరచూ చోటు చేసుకునే ‘‘సీన్లు’’ రానున్న రోజుల్లో తెలంగాణలోనూ తప్పవని చెప్పక తప్పదు. అదే జరిగితే.. రాష్ట్రంలో సరికొత్త రాజకీయం తెలంగాణ ప్రజలు చూడనున్నారని చెప్పక తప్పదు.

Next Story