రాష్ట్రంలో నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్‌పీఆర్‌) ప్రక్రియను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్‌పీఆర్‌ విషయంలో పలు వర్గాల్లో అభ్యంతరాలు, సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో పది సంవత్సరాల కోసారి జనగణన సర్వే చేపడతారు. ఈసారి 2020-21 జనగణన చేపట్టాల్సి ఉంది. అలాగే ప్రతి ఐదేళ్ల కోసారి ఎన్‌పీఆర్‌ సవరణ జరుగుతుంది. జనగణనకు సన్నాహకంగా హౌస్‌ హోల్డ్‌ సర్వే నిర్వహిస్తారు. దీంతో పాటే ఎన్‌పీఆర్‌ వివరాలను సేకరించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. కాగా, గతంలో ఉన్న ఎన్‌పీఆర్‌ ఫార్మట్‌ను సవరించి మరికొన్ని ప్రశ్నలను జోడించింది. జాతీయపౌర పట్టిక తయారీకి ఎన్‌పీఆర్‌ ప్రాతిపదికగా భావిస్తున్న నేపథ్యంలో కొన్న ప్రశ్నల జోడింపు తీవ్ర వివాదంగా మారింది.

ఎన్‌పీఆర్‌ ఉద్దేశం ఏమిటీ..?

జనాభా లెక్కల చట్టం ప్రకారం జనగణన చేపడతారు. దేశంలో జన సంఖ్యను తెలుసుకోవడం దీని ప్రధాన ఉద్దేశం. అలాగే పౌరసత్వ చట్ట -1955, పౌరసత్వ నియమాలు -2003 కింద ఎన్‌పీఆర్‌ చేపడతారు. ఒక నివాసి ప్రాంతంలో ఆరు నెలలుగా నివాసం ఉన్నా, లేదా ఆరు నెలల పాటు నివసించాలని అనుకుంటున్న వ్యక్తుల వివరాలను సేకరించడం ఎన్‌పీఆర్‌ ముఖ్య ఉద్దేశంగా చెప్పవచ్చు. జనగణన అయినా,  ఎన్‌పీఆర్‌ అయినా చట్టంలోని ఫలానా సెక్షన్‌ కింద చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయాల్సి ఉంటుంది.

కాగా, పలు రాష్ట్రాలు ఏప్రిల్‌ 1 నుంచి ఈ ప్రక్రియ అమలు చేయనున్నాయి. ఈ అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ ఈ అంశాన్ని  వాయిదా వేసింది. ప్రక్రియ పూర్తికి చాలా సమయం ఉన్నందున ప్రస్తుతానికి ఎన్‌పీఆర్‌ను వాయిదా వేసి, పరిస్థితుల మేరకు తర్వాత ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని తెలంగాన సర్కార్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కలెక్టర్లకు శిక్షణ కార్యక్రమాన్ని కూడా వాయదా వేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రమంతటా పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.