సీనియర్ నేతను పక్కనపెట్టి...కేటీఆర్ కు సీఎం పట్టం ?
By రాణి Published on 28 Jan 2020 9:08 AM GMTముఖ్యాంశాలు
- కేటీఆర్ కి పూర్తి స్థాయిలో కలిసొస్తున్న కాలం
- మునిసిపోల్స్ లో మరోసారి సత్త నిరూపణ
- నమ్మి కేటీఆర్ కే బాధ్యతలు అప్పగించిన కేసీఆర్
- ఘన విజయాన్ని సాధించిన టిఆర్ఎస్ పార్టీ
- కుదేలైన ప్రతిపక్షాలు, నోరు పెగలని ప్రతిపక్ష నేతలు
- త్వరలోనే కేటీఆర్ కి ముఖ్యమంత్రి పదవన్న ప్రచారం
- పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్న పార్టీ శ్రేణులు, ప్రజలు
- కేసీఆర్ నిర్ణయంకోసం అందరి ఎదురుచూపులు
హైదరాబాద్ : కేటీఅర్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా అని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, క్యాడర్ ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పార్టీకి చెందిన మంత్రులు, ముఖ్యనేతలకుకూడా ఈ విషయంలో ఆసక్తి రోజు రోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చి పార్టీని ముందుకు నడిపించే బాధ్యతలను అప్పగించినప్పట్నుంచీ కేటీఆర్ శరవేగంతో దూసుకుపోతున్నారు.
మొన్నటి మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో విజయఢంకా మోగించిన దగ్గరినుంచీ పార్టీ కార్యకర్తలు, ఉన్నత శ్రేణుల్లో ఈ ఉత్సాహం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. త్వరలోనే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిని, పార్టీ పగ్గాలను పూర్తి స్థాయిలో కేటీఆర్ కి అప్పగించి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలు కిందటి అసెంబ్లీ ఎన్నికలకు ముందే విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి.
మునిసిపోల్స్ లో దిమ్మతిరిగే దెబ్బకొట్టిన కేటీఆర్
ఐటీ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా సక్సెస్ ఫుల్ యువనాయకుడిగా రాజకీయాల్లో రాణిస్తున్న కేటీఆర్ మునిసిపోల్స్ లో సత్తాని చాటి పార్టీ ప్రతిష్ఠను నిలబెట్టిన తీరు దేశవ్యాప్తంగా తలపండిన రాజకీయనేతలకుకూడా ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశమయ్యింది. అసలు మునిసిపోల్స్ ప్రచారానికి ఈసారి పూర్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా దూరంగా ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. కేటీఆర్ పై ఉన పూర్తి భరోసాతోనే ఆయన అలా ప్రచారానికి దూరంగా ఉన్నారనీ, కేటీఆర్ ని మరింత లోతుగా ప్రజల హృదయాల్లోకి తీసుకెళ్లేందుకే ఆయన ఆ స్ట్రాటజీని అవలంబించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మునిసిపోల్స్ ప్రచారానికి దూరంగా ఉండడం ద్వారా కేటీఆర్ కి పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలను అందించేందుకు కేసీఆర్ సిద్ధపడినట్టుగా తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా చూసే శుభతరుణం దగ్గర్లోనే ఉందని పార్టీ వర్గాలు, కేడర్ బలంగా నమ్ముతున్నాయి.
మునిసిపోల్స్ లో పార్టీని పూర్తి స్థాయిలో విజయపథంలో నడిపి కేటీఆర్ మరోసారి తన సత్తాని నిరూపించుకున్నారంటూ రాజకీయ దురంధరులు సైతం కొనియాడుతున్న పరిస్థితి తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోంది. యంగ్ జనరేషన్ కి బాధ్యతలు అప్పగిస్తే ఎలా అద్భుతమైన విజయాలు సాధించి చూపిస్తారో మునిసిపోల్స్ విషయంలో స్పష్టంగా రుజువయ్యిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. కేసీఆర్ తర్వాత పార్టీలో సమర్ధుడైన నాయకుడిగా ఎదిగిన కేటీఆర్ ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారని పార్టీ వర్గాలు గట్టిగా భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేటీఆర్ సామర్ధ్యంపై ఉన్న నమ్మకాన్ని ఇప్పుడు మరింతగా పెంచుకున్నారు. స్థానిక సమస్యలపై సత్వరమే స్పందించడం కేటీఆర్ ప్రత్యేకత. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించడం ద్వారా ఆయన ప్రజల హృదయాలను గెలుచుకోగలుగుతున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో గుర్తించినందువల్లనే కేటీఆర్ భుజస్కందాలపై పూర్తి స్థాయిలో ప్రాధాన్యత కలిగిన బాధ్యతలను మోపుతూవస్తున్నారు.
హైదరాబాద్ లో జరిగిన జి.ఇ.ఎస్ 2017 అంతర్జాతీయ సమావేశంలో కేటీఆర్ చొచ్చుకుపోయిన తీరు, ప్రపంచం దృష్టిని పూర్తిగా హైదరాబాద్ మీదికి లాక్కొచ్చిన తీరు ముఖ్యమంత్రి కేసీఆర్ సహా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని అబ్బురపరచింది. ఆ సమిట్ లో కేటీఆర్ చూపిన ప్రతిభ కారణంగా హైదరాబాద్ కి కొత్త ప్రాజెక్టులు వెల్లువెత్తిన విషయమూ అందరికీ తెలిసిందే.
మరెందుకు ఆలస్యం?
కేటీఆర్ కి పూర్తి స్థాయిలో పగ్గాల్ని అప్పగించేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు తన్నీర్ హరీష్ రావు పూర్తి స్థాయిలో అలకపూనే ప్రమాదం ఉండొచ్చన్నది కొందరు సీనియెర్ నేతల అభిప్రాయం. నిజానికి హరీష్ రావు సీనియెర్ నేతే అయినప్పటికీ, ఆయన సమర్థతపట్ల తెలంగాణ ప్రజల్లో విశ్వాసం ఉన్నప్పటికీ కేటీఆర్ కీ హరీష్ రావ్ కీ మధ్య పోటాపోటీగా భవిష్యత్ ముఖ్యమంత్రి కుర్చీకోసం పోటీ నడుస్తోందని పార్టీవర్గాల్లో గుసగుసలు వినిపించడం గమనార్హం. ప్రతిపక్షాలు ఓ అడుగు ముందుకేసి హరీష్ రావ్ సమర్థుడైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తన కొడుకైన కేటీఆర్ భవిష్యత్తుకోసం హరీష్ రావును పూర్తిగా పక్కకు నెట్టేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించిన, గుప్పిస్తున్న విషయంకూడా అందరికీ తెలిసిందే. అసలు కేటీఆర్ కి పార్టీ పగ్గాల్నీ, ముఖ్యమంత్రి పదవినీ అప్పజెబితే మరుక్షణమే హరీష్ రావ్ పార్టీలోంచి వైదొలగుతారన్న ప్రచారాన్నీ ప్రతిపక్షాలు ముమ్మరంగా చేస్తున్నాయి.
మీడియాలో మాత్రం ఇన్నాళ్లూ హరీష్ రావే ముఖ్యమంత్రి కేసీఆర్ కి సరైన రాజకీయ వారసుడనీ, ముఖ్యమంత్రి పదవికి అర్హుడనీ గట్టిగా ప్రచారం జరుగుతూ వచ్చింది. నిజానికి తెలంగాణలో ఛరిష్మా ఉన్న నాయకుల్లో కేసీఆర్ తర్వాత హరీష్ రావు పేరు ప్రముఖంగా వినిపించేమాటకూడా వాస్తవమే. కానీ ఇప్పుడు కేటీఆర్ వరస విజయాలు సాధిస్తూ ప్రజల్లో తనకున్న పరపతిని, తన చరిష్మాని పెంచుకుంటూ విస్తృత స్థాయిలో ప్రజాభిమానాన్ని ప్రోదిచేసుకుంటూ రేసులో ముందు వరసలోకి వచ్చేశారు.
యువరక్తం ప్రాధాన్యత
నిజానికి ఈ మునిసిపోల్స్ ప్రతిపక్షాలకు ఉన్న అపోహలన్నింటినీ పూర్తి స్థాయిలో తొలిగించేశాయనే చెప్పాలి. టీఆర్ఎస్ మీద కయ్యానికి కాలు దువ్వుతూ అసలు ప్రజల్లో ఆ పార్టీకి పూర్తిగా నమ్మకంపోయిందని ప్రచారం చేస్తూ వస్తున్న ప్రతిపక్షాలు మునిసిపోల్స్ లో కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి సాధించిన విజయాన్ని చూసి ఖంగుతిన్నాయి.
120 స్థానాల్లో పూర్తిగా 100 స్థానాలను కైవసం చేసుకుని మునిసిపోల్స్ లో క్లీన్ స్వీప్ చేసిన టిఆర్ఎస్ సత్తాని జీర్ణం చేసుకోవడం ఇప్పుడు ప్రతిపక్షాలకుకూడా సాధ్యంకావడంలేదు. ఎన్ని వ్యతిరేక ప్రచారాలు చేసినా సరే ప్రజలు పూర్తిగా టీఆర్ఎస్ పక్షానే నిలబడడం తెలంగాణలో ప్రతిపక్షాలకు ఇప్పుడు అస్సలు మింగుడుపడని విషయంగా ఉంది. పైగా ఈ మునిసిపోల్స్ పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలకు అవమాన భారాన్ని మిగల్చడంతో ఇకపై ప్రత్యర్థి పార్టీలకుగానీ, ప్రత్యర్థి పార్టీల నేతలకుగానీ కనీసం ఆరోపణలు చేయడానికైనా నోరు పెగిలే పరిస్థితి కనిపించడం లేదు.
తెలంగాణ రాజకీయ చైతన్యం
తెలంగాణలో రాజకీయ చైతన్యం ఇప్పుడు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. గడచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాస్తో కూస్తో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ వైభవం వస్తుందని కొందరు భావించినప్పటికీ అంచనాలు, ఊహలు తలకిందులై ప్రతిపక్షాలకు తీరని వేదనే మిగిలిందని రాజకీయ విశ్లేషకులు బాహాటంగానే విమర్శించారు. ఇప్పుడు మునిసిపోల్స్ ని టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చెయ్యడంతో అసలు ప్రతిపక్షాలకు మనుగడే ప్రశ్నార్థకంగా మారిన వైనం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా ప్రతిపక్షాలు, ప్రతిపక్ష నాయకులూ అందరూ కట్టకట్టుకుని మునిసిపోల్స్ లో టీఆర్ఎస్ మెడలు వంచాలన్న దృఢమైన దీక్షతో పనిచేశారు. అయినప్పటికీ ఎదురుదెబ్బలు తినడం మినహా వాళ్లు సాధించింది ఏమీ లేదన్న విషయం తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయింది.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంక ప్రతిపక్షాలు టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా ప్రజల్లో పూర్తి స్థాయిలో వాళ్లు విస్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోయి పరిస్థితి ఎదురవుతుందన్న సత్యం వాళ్లకు మళ్లీ ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన పనిలేదు. అలా చేస్తే ఈ సారి నేరుగా రాజకీయ సన్యాసం స్వీకరించాల్సిన పరిస్థితికి చేరుకుని , శంకరగిరి మాన్యాలు పట్టే పరిస్థితి ఎదురవుతుందన్న విషయం ఈ పాటికి ప్రతిపక్షనేతలకు స్పష్టంగా అర్థమయ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
వందేళ్ల పార్టీకి ముప్పుతిప్పలు
మరీ ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్, టిడిపి, బిజెపి, ఇతర పక్షాలు అన్నీ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తడం, ఏదో సాధించే ప్రయత్నం చేయడం తెలంగాణ ప్రజలకు ఏమాత్రం రుచించడంలేదన్న విషయం సుస్పష్టంగా ప్రతిపక్షాలకు మునిసిపోల్స్ లో టిఆర్ఎస్ అఖండ విజయం చెప్పకనే చెప్పిందన్న అంశం తేటతెల్లమయ్యింది.
ఒడిషాలో నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలో బిజెపి ప్రభుత్వం రెండు దశాబ్దాలపాటు ఏకఛత్రాధిపత్యంగా రాజ్యమేలిన విషయం అందరికీ తెలిసిందే. వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ వల్ల ఏర్పడిన శూన్యాన్ని అయితే స్థానిక పార్టీలో లేకపోతే జాతీయ పార్టీలో అక్రమిస్తున్న విషయంకూడా స్పష్టంగానే అందరికీ అర్థమవుతూనే ఉంది. అంటే దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి వెనకటి కాలంలో కనిపించినంత విశ్వసనీయత మళ్లీ కనుచూపుమేరలో కనిపించే పరిస్థితి లేనేలేదన్నది సామాన్యులకు కూడా అర్థమవుతున్న సత్యమనే చెప్పాలి.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాధాన్యతలు, ప్రాముఖ్యతలను బలంగా ఎరిగి ప్రజల అభిమానాన్ని విస్తృత స్థాయిలో చూరగొంటున్న టి.ఆర్.ఎస్ పార్టీని తక్కువ చేయడం ఇప్పట్లో కాంగ్రెస్ కు సాధ్యమయ్యే ప్రశ్నే ఉత్పన్నం కాదు. కొందరు రాజకీయ విశ్లేషకులైతే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితం అయిపోయిన పార్టీగా అభివర్ణించే సాహసంకూడా బాహాటంగానే చేసేస్తున్నారు.
అంటే టీఆర్ఎస్ దెబ్బకొట్టగలిగిన సామర్ధ్యం సంగతి అటుంచితే అసలు ఆ భావన చేయడానికైనా సాహసం చేసే పరిస్థితి మరో ఐదారేళ్లవరకూ అయితే కచ్చితంగా ప్రతిపక్షాలకు, ముఖ్యంగా కాంగ్రెస్ కు తెలంగాణలో లేనేలేదన్నది స్పష్టంగా అందరికీ కనిపిస్తున్న సత్యమనే చెప్పాలి. రాజకీయంగా ప్రత్యర్థులు అసలు గుర్తించగలిగే స్థితిలోనే లేకుండా చేయగలిగిన చాకచక్యం దక్షిణాదిలో గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి, నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి మాత్రమే కనిపిస్తోందని చెప్పాలి.
నవతరం నాయకత్వం
పైగా ఇప్పుడు ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కీ, నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికీ ఉన్న సత్సంబంధాలవల్ల అసలు తెలంగాణ రాష్ట్రానికీ నవ్యాంధ్రప్రదేశ్ కీ మధ్య ఎలాంటి పొరపొచ్చాలూ లేకుండా అభివృద్ధిపథంలో దూసుకుపోయే పరిస్థితులే కనిపిస్తున్నాయన్నది విస్పష్టం.
ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, ఆలోచనలను పంచుకుంటూ రెండు రాష్ట్రాలనూ ప్రగతిపథంలో నడిపించాలన్న ఇరువురు ముఖ్యమంత్రుల ఆలోచనా రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజానీకానికీ బాగా నచ్చింది. ఈ నేపధ్యంలో ఏపీలో యువముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సాధిస్తున్న విజయాలు, దూసుకుపోతున్న తీరు ఆకట్టుకునే రీతిలో ఉండడం ఇక్కడ తెలంగాణలోకూడా యువరక్తం ప్రాధాన్యతను, యువనేత అవసరాన్నీ గట్టిగానే సూచిస్తున్నాయి.
ఈ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన తనయుడు, యువతరం నాయకుడు, సమర్థుడైన నాయకుడు కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా ప్రకటించడమే తరువాయి అని తెలంగాణలో అన్ని వర్గాలూ భావిస్తున్నాయి. ఆ సముచితమైన నిర్ణయాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించేందుకు పార్టీ శ్రేణులు, కేడర్, ప్రజలుకూడా మానసికంగా సంసిద్ధులై ఉన్నారనడంతో ఎలాంటి సందేహం లేదు.
ఉన్న ఒకే ఒక సందేహమల్లా అపర చాణుక్యుడు, రాజకీయ దురంధరుడు అయిన కేసీఆర్ మీద గౌరవంతో, ప్రేమతో కేటీఆర్ వెంటనే ముఖ్యమంత్రి పదవిని స్వీకరించడానికి ఒప్పుకోకుండా కొద్దికాలం పాటు ఆగుతారా లేక ఆయన ఆదేశాలను శిరసావహించి వెంటనే రాజుగారి కుర్చీలో కూర్చోవడానికి అంగీకరిస్తారా అన్నది మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్న ఏకైక మీమాంస. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు మాత్రం వెంటనే కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా చూడాలని ఆశపడుతున్నారన్నది మాత్రం నిర్వివాదాంశం. అందులో అణుమాత్రమైనా సందేహానికి తావే లేదు.