త్వరలో తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు !?

By రాణి  Published on  18 Dec 2019 9:49 AM GMT
త్వరలో తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు !?

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టంలో భూముల ధరలు పెరగనున్నాయని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. చివరి సారిగా 2013 ఆగస్టులో టీడీపీ హయాంలో రాష్ర్టంలో భూముల ధరలు పెరిగాయి. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటయ్యాక మొదటి సారిగా రాష్ర్ట ప్రభుత్వం భూముల ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రిజిస్ర్టేషన్ల శాఖ ప్రతిపాదనలు, స్టాంపులను సిద్ధం చేస్తుందట. అయితే ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ రాష్ర్టంలో భూముల ధరల పెంపు గురించి ప్రస్తావించగా..అందుకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు వివరించారు కూడా. అయితే మరింత పకడ్బందీగా, మెరుగైన ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం సూచనలు చేశారు.

ఈ మేరకు అధికారులు కసరత్తు చేయడం మొదలు పెట్టారు. రియల్టర్లతో ఇప్పటి చర్చలు జరిపారు. త్వరలో ఈ ప్రతిపాదనలతో కూడిన నోట్ ను సీఎంకు అందజేయనున్నారు. అయితే భూముల ధరల పెంపుపై అధ్యయనం చేసేందుకు అన్ని జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు, డిప్యూటీ రిజిస్ర్టార్లు, సబ్ కలెక్టర్లతో కూడిన త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కమిటీల సిఫార్సు మేరకు ప్రస్తుతం ఉన్న భూముల ధరలు కనీసం 25% పెరుగుతాయట. పెంచిన ధరలను రెవెన్యూ శాఖ నోటిఫై చేయనుంది. ప్రభుత్వ, మార్కెట్ ధరల మధ్య తేడా ఆధారంగా కమర్షియల్, అర్బన్, రూరల్ భూముల ధరలు 10 నుంచి 100% వరకు పెరిగే అవకాశాలు లేకపోలేదనే చెప్పారు. భూముల ధరలతో పాటు రిజిస్ర్టేషన్ ఛార్జీలు, స్టాంప్ ల ధరలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Next Story