హైకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని తెలంగాణ సర్కార్

By సుభాష్  Published on  3 July 2020 10:44 AM GMT
హైకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని తెలంగాణ సర్కార్

తెలంగాణ రాష్ట్ర సర్కారుకు హైకోర్టులో మరోసారి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. అధికారికంగా విద్యా సంవత్సరం మొదలు కాక ముందే.. ఆన్ లైన్ లో క్లాసులు ఎలా నిర్వహిస్తారన్న మౌలికప్రశ్నకు సమాధానం చెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వానికి తెగ ఇబ్బంది పడిపోయింది. ఇటీవల కాలంలో ఆన్ క్లాసుల నిర్వహణ విషయంలోనూ.. కరోనా టెస్టుల విషయంలోనూ న్యాయస్థానాల్లో నీళ్లు నమలాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.

ఓపక్క ప్రభుత్వం అధికారికంగా ఆన్ లైన్ క్లాసులకు అనుమతులు ఇవ్వలేదు. కానీ.. పలు ప్రైవేటు విద్యా సంస్థలు మాత్రం ఎవరికి వారు ఆన్ లైన్ లో క్లాసులు చెబుతూ.. ఫీజుల కోసం ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో.. విద్యార్థుల తల్లిదండ్రుల ఇబ్బందులు అన్నిఇన్ని కావన్నట్లుగా మారింది. ఇదే సమయంలో ప్రైవేటు విద్యా సంస్థలు అనుసరిస్తున్న వైఖరిపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు.. ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేకపోయింది.

దీంతో.. హైకోర్టు అసహనం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆన్ లైన్ లో తరగతుల నిర్వహణకు అనుమతి ఇవ్వని ప్రభుత్వం.. వాటిని ఎందుకు అడ్డుకోలేకపోతుందని ప్రశ్నించింది. ప్రభుత్వం ద్వందవైఖరిని అనుసరిస్తుందని.. మహారాష్ట్రలో మాదిరి స్పష్టమైన నిర్ణయం ఎందుకు తీసుకోరని నిలదీసింది.

హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ఆసక్తికర వాదనకు తెర తీశారు. నెల రోజులుగా విద్యార్థుల కెరీర్ కోసం ఆన్ లైన్ క్లాసుల్ని నిర్వహిస్తున్నామన్నారు. తరగతులు జరగకపోతే విద్యార్థుల కెరీర్ స్తంభించిపోతుందన్న ఆయన వ్యాఖ్యలపై హైకోర్టు స్పందిస్తూ..అయితే.. ఒక్కో ఇంట్లో రెండు మూడు ల్యాప్ టాప్ లు కొనే పరిస్థితి ఉందా? అని సూటి ప్రశ్నల్ని వేసింది. ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏసీ గదుల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకోవద్దని.. గిరిజన.. ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యార్థుల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొంది.

మహమ్మారి కారణంగా ప్రపంచ మానవాళే స్తంభించిపోయిందన్న హైకోర్టు.. ఈ విషయంలో సీబీఎస్ఈ.. ఎన్సీటీఈని ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశించింది. కేంద్రంతో పాటు సీబీఎస్ వాదనల్ని కూడా వింటామంది. ఈ నెల 31 వరకు స్కూళ్లు తెరవొద్దన్న న్యాయస్థానం.. ఈ కేసు విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. మొత్తంగా హైకోర్టు ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తెలంగాణ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Next Story