కార్వీకి భారీ షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

By రాణి  Published on  4 March 2020 1:11 PM GMT
కార్వీకి భారీ షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్(కె.ఎస్.బి.ఎల్.) సంస్థకు తెలంగాణ హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. తమ గ్రూప్‌ కంపెనీల వ్యవహారాలపై సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌(ఎస్.ఎఫ్.ఐ.ఓ) కు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై కార్వీ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. జస్టిస్ అభినంద్ కుమార్ కె.ఎస్.బి.ఎల్. సంస్థ వేసిన పిటీషన్ ను కొట్టివేశారు. సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది.

కార్వీ లాయర్లు వాదిస్తూ 212 సెక్షన్ ప్రకారం ఎస్.ఎఫ్.ఐ.ఓ. కు డైరెక్టుగా కేసును అప్పగించడం అన్యాయం అని అన్నారు. కంపెనీల చట్టంలోని సెక్షన్ 206, 208 ప్రకారం విచారణ అన్నది సాగలేదని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలని భావిస్తోందని వారు వాదించారు.

కంపెనీల చట్టం సెక్షన్ 212 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి కంపెనీల వ్యవహారాలపై సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ కు బాధాతలు అప్పగించే అధికారాలు ఉన్నాయంటూ కేంద్రం తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ నామవారపు రాజేశ్వర రావు వాదనలు వినిపించారు. కార్వీ సహా తొమ్మిది కంపెనీలపై ఫిబ్రవరి 24న కేంద్రానికి నివేదిక పంపారని, ఈ కంపెనీలపై దర్యాఫ్తు జరపాల్సిన అవసరముందని ఆయన వాదించారు. కార్వీ కంపెనీ మాత్రమే కాకుండా కార్వీ కన్సల్టెంట్స్, విజార్డ్ ఇన్సూరెన్స్ సర్వీస్, జెనిత్ ఇన్సూరెన్స్, బ్యూయాంట్ ఇన్సూరెన్స్ సర్వీసెస్, నోవా వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్, క్లాసిక్ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్, ఛాంపియన్ ఇన్సూరెన్స్ సర్వీసెస్, పెలికాన్ వెల్త్ సర్వీసెస్ కంపెనీలపై సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ తప్పకుండా దర్యాప్తు జరపాలని ఆయన అన్నారు. అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ వాదనలు విన్న న్యాయమూర్తి కార్వీ వేసిన పిటీషన్ ను కొట్టివేశారు. దీంతో కార్వీపై సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ దర్యాప్తు చేయడానికి మార్గం సుగమమైంది.

కార్వీ లాంటి కంపెనీలు మోసాలు చేస్తున్నాయి

కార్వీ బ్రోకింగ్‌ లాంటి మోసాలకు చెక్‌ పెట్టడానికి అతి త్వరలో నూతన మార్గదర్శకాలను విడుదల చేయబోతున్నట్లు స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి చైర్మన్‌ అజయ్‌ త్యాగి కొద్ది రోజుల క్రితం కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కార్వీ లాంటి కొన్ని సంస్థలు క్లయింట్లను మోసం చేసి డబ్బును సొంత అవసరాలకు వాడుకుంటున్నాయని అజయ్ ఫిబ్రవరి నెలలో చెప్పారు. ఇలాంటి మోసాలు ఇకపై సాగకుండా ఉండడానికి కొత్త మార్గదర్శకాలు తీసుకొని వస్తున్నట్లు ఆయన చెప్పారు. 2019 నవంబర్ లో కె.ఎస్.బి.ఎల్. లో అవకతవకలు గుర్తించి వాటి లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా నోటీసులను కూడా పంపించారు. పెట్టుబడి దారుల దగ్గర నుండి డబ్బులు తీసుకుని.. ఆ డబ్బును కాస్తా కొన్ని సంస్థలు వాటి అవసరాల కోసం వాడడం ఇటీవలే బహిర్గతమవడంతో పెట్టుబడి దారుల్లో ఆందోళనలు మిన్నంటాయి. అంతేకాకుండా అజయ్ త్యాగి లాంటి వ్యక్తి కొన్ని కంపెనీలపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఎలాంటి మోసాలు జరిగాయా అని పెట్టుబడి దారులు భయపడుతూ ఉన్నారు. పెట్టుబడి దారుల డబ్బులు ఎక్కడికీ వెళ్లవని.. వారి శ్రేయస్సే అధిక ప్రాధాన్యమని అజయ్ త్యాగి వెల్లడించడంతో పెట్టుబడి దారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అజయ్ త్యాగి మూడేళ్ళ పదవీ కాలం మార్చి 31న ముగియనుంది. ఆరోజున ఆయన పదవీ విరమణ చేయనున్నారు.

Next Story