నేడు టీఎస్ కేబినెటట్ విస్తరణ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Sep 2019 6:59 AM GMT
నేడు టీఎస్ కేబినెటట్ విస్తరణ

* కేటీఆర్, హరీష్, మరో నలుగురికి కేసీఆర్ మంత్రి వర్గంలో చోటు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ ను విస్తరించాలని నిర్ణయించారు. కొత్త మంత్రి వర్గంలోని సభ్యులు ఆదివారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని రాజభవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిబంధనల ప్రకారం కేబినెట్ లో 18 మంది సభ్యలకు స్థానం ఉంటుంది. అయితే ప్రస్తుత రాష్ట్ర కేబినెట్ లో ముఖ్యమంత్రితో సహా 12 మంది సభ్యులు ఉన్నారు. నేడు మరో ఆరుగురికి చోటు కల్పించనున్నారు.

టీఆర్ఎస్ రెండోసారి అధికారం చేపట్టిన నాటి నుండి హరీష్ రావు , కేటీఆర్ లకు కేబినెట్ లో చోటు కల్పించలేదు. ఈసారి వీరిద్దరికి కేబినెట్ లో స్థానం కల్పించారు. వీరితోపాటు మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మంత్రి వర్గంలోకి తీసుకోనున్నారు.

గత కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించలేదనే విమర్శలు కేసీఆర్ ప్రభుత్వం ఎదుర్కొంది. అయితే..సబితా ఇంద్రారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా విమర్శలకు చెక్ పెట్టాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నుంచి కాంగ్రెస్ పార్టీ సింబల్ పై గెలిచారు. మారిన రాజకీయాలతో సబితా ఇంద్రారెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన అనుభవం సబితా ఇంద్రారెడ్డికి ఉంది.

కేబినెట్ పోర్ట్ పోలియోస్ ను పునరుద్ధరించాలనే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ వున్నారు. కేటీఆర్ కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హరీష్ రావు కు ఫైనాన్స్ , ఇరిగేషన్ శాఖలు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. మున్నూరు కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యం కల్పిస్తూ గంగుల కమలాకర్ ను కేబినెట్ లోకి తీసుకునేందుకు ఆయన్ను వెంటనే హైదరాబాద్ రావాలని ఆదేశించారు. చట్ట సభల్లో మరో మహిళకు స్థానం కల్పించేందుకు సత్యవతి రాధోడ్ ను కేబినెట్ లోకి తీసుకుంటున్నారు.

సెప్టెంబర్ 8 దశమి శుభప్రధమైన రోజు కావడంతో ఆ రోజే మంత్రివర్గ విస్తరణకు మంచిదని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అదే రోజు మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవహారాల చీఫ్ సెక్రటరీ ఎస్ కే జోషి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ విషయంపై రాత్రి 7 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది.

తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కొత్త మంత్రి వర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గులాబీ జెండాకు నేనూ బాస్ నే అనే మాటలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. మంత్రులు పాలన మీద పట్టు కోల్పోతూ ..ప్రభుత్యాన్ని విమర్శించేందుకు ..ప్రతి పక్షాలకు ముఖ్యంగా బీజేపీకి అవకాశం కల్పిస్తున్నారు. ఇలా కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మంత్రివర్గ విస్తరణకు దారి తీసి ఉండొచ్చు.

Next Story