తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల సందర్భంగా గవర్నర్‌ తమిళిసై ప్రసంగించారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన శాసన సభ వ్యవహారాల సలహా సంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీతోపాటు సమావేశాల ఎజెండాను ఖరారు చేశారు. ఈనెల 8వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మొత్తం సమావేశాలు 12 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు 20వ వరకు కొనసాగనున్నాయి. ఈనెల 9, 10, 15 తేదీల్లో సభకు సెలవులు ప్రకటించారు. బీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు, అక్బరుద్దీన్‌ ఓవైసీ, భట్టి విక్రమార్కలు హాజరయ్యారు.

కాగా, తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తమిళి సై తొలిసారిగా అసెంబ్లీలో ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అందరికీ నమస్కారం అంటూ గవర్నర్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితో తెలంగాణ అగ్ర పథాన పని చేస్తోందని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటైన సమయంలో విద్యుత్‌ సమస్య, తాగునీటి కొరత, ఆత్మహత్యలు, వలసలు తదితర సమస్యలను కొట్టుమిట్టాడేదని, కేసీఆర్‌ విధానాలు, చేపట్టిన చర్యల వల్ల వాటన్నింటినీ అధిగమించినట్లు చెప్పారు. తక్కువ కాలంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. ప్రస్తుతం రైతులకు మెరుగైన విద్యుత్‌ అందిస్తున్నామని, విత్తనాలు,  ఎరువులు సమయానికి అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే నకిలీ ఎరువులను కూడా అరికట్టగలిగామన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.