తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వారం రోజులేనా..?

By సుభాష్  Published on  19 Aug 2020 6:37 AM GMT
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వారం రోజులేనా..?

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్‌ 7వ తేదీ నుంచి జరగనున్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం 15 నుంచి 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ భావించినప్పటికీ కరోనా కారణంగా 7 నుంచి 10 రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అలాగే శాసనమండలిని ఐదు రోజుల పాటు జరపాలని యోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ సమావేశాలను ఈ ఏడాది మార్చి 6 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించాలని అనుకున్నా.. కరోనా వల్ల మార్చి 16నే ముగించారు.

ఇక కరోనా నిబంధనలకు అనుగుణంగా అసెంబ్లీలో సభ్యులు భౌతిక దూరం పాటించేలా సీట్ల ఏర్పాటుపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వి. నర్సింహాచార్యులు మంగళవారం అసెంబ్లీ సమావేశ మందిరంతో పాటు విజిటర్స్‌, ప్రెస్‌ గ్యాలరీని సందర్శించారు. అలాగే మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి సమావేశాల ఏర్పాట్లపై చర్చించే అవకాశం ఉంది. అనంతరం సమావేశాలు నిర్వహించాల్సిన తీరుపై సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల మరణించిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి సంతాపం తెలిపే తీర్మానంతోపాటు పలు బిల్లులను ఈ సమావేశంలో ఆమోదించనున్నారు. ప్రైవేటు యూనివర్సిటీల సవరణ బిల్లు, తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ, ఎఫ్‌ఆర్‌బీఎం, టీచింగ్‌ ఆస్పత్రుల్లో పని చేసే అధ్యాపకుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంపు వంటి ఆర్డినెన్స్‌లు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే నూతన సచివాలయ భవన నిర్మాణం వంటి అంశాలపై అసెంబ్లీలో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Next Story