భారత్ నుండి విదేశాలకు ఎగుమతి అయ్యే 26 రకాల రొయ్యల ప్రోడక్ట్స్ ను అమెరికా, యూరప్ దేశాలకు చెందిన అధికారులు తిరస్కరించారు. వీటిలో చాలా వెరైటీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలోనే ఉత్పత్తి చేశారు. యునైటెడ్ స్టేట్స్, యూరప్ లకు చెందిన ఫుడ్ టెస్టింగ్ అధికారులు 2019లో మొత్తం 26 రకాల ఉత్పత్తులకు తమ దేశంలో స్థానం లేదని చెప్పారు. నిషేధించబడిన యాంటీ బయోటిక్స్ ను వాడిన కారణంగా ఈ ఉత్పత్తులకు అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కు చెందిన ది ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్.డి.ఏ) అధికారులు మొత్తం 26 రకాల ఉత్పత్తులను గతేడాది బ్యాన్ చేశారు. 2017, 2018 సంవత్సరాలలో ఏకంగా 27 రకాల ఉత్పత్తులను వారి దేశంలో అనుమతించడానికి నిరాకరించారు. మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీకి (MPEDA) చెందిన అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్ నుండి పెద్ద ఎత్తున రొయ్యలు అమెరికాకు వెళుతూ ఉంటాయని..భారత్ నుండి వెళ్లే వాటికి అధిక డిమాండ్ ఉందని.. కానీ కొన్ని యాంటీ బయోటిక్స్ ను మన వాళ్ళు వాడడం వలన ఇతర దేశాలకు చెందిన అధికారులు వాటిని తిరస్కరిస్తున్నారు. మొత్తం 20 రకాల యాంటీ బయోటిక్స్ ను వాడకూడదని మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్ మెంట్ అథారిటీ స్పష్టం చేసింది. అయినా కూడా కొందరు వాటినే వాడుతున్నారట.

హైదరాబాద్ లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్ మెంట్ బోర్డు(NFDB) దేశంలో చేపలు, రొయ్యల పెంపకాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ అధికారి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉత్పత్తి చేసే రొయ్యలు చాలా సున్నితమైనవే కాకుండా.. ఏవైనా రోగాలు చాలా తొందరగా సోకే అవకాశం ఉందని అంటున్నారు. వీటిలో చిన్న రోగం అన్నది ప్రబలిందంటే చాలా నష్టం వస్తుందని భావించి రొయ్యల పెంపకం దారులు వాటికి యాంటీ బయోటిక్స్ ను ఇచ్చేస్తుంటారు. వాటిలో మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వాడకూడదని చెప్పిన 20 రకాల యాంటీ బయోటిక్స్ లో ఏదో ఒకటి ఉండడం చేత విదేశాలు వీటిని ఎగుమతి చేసుకోవడం లేదని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన బ్లాక్ టైగర్ రొయ్యలకు డిమాండ్ తగ్గడంతో రొయ్యల పెంపకందారులు పెద్ద ఎత్తున నష్టపోయారట. మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ చెప్పిన సూచనలు పాటించి రొయ్యలకు యాంటీ బయోటిక్స్ ఇస్తే విదేశాలకు ఎగుమతి చేయడం పెద్ద సమస్య కాదని అధికారులు చెబుతున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.