వరుసగా రెండోరోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా.. ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కేంద్రప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అభ్యతరం తెలిపారు. దీంతో అక్కడ స్వల్ప వాగ్వాదం జరిగింది.

మధ్యలో కలుగజేసుకున్న సీఎం కేసీఆర్..జీఎస్టీ, ఐజీఎస్టీ రెండు ప్రభుత్వాలు కలిపి నిర్వహిస్తున్న ట్యాక్స్ అని..వీటిలో పరిమితులున్నాయన్నారు. కాగా..జీఎస్టీ వసూళ్లలో రాష్ర్టానికి రావాల్సిన వాటా కేంద్రం ఇవ్వడం లేదని..ఈ విషయంపైనే టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో ఆందోళన కూడా చేశారన్నారు. తర్వాత రూ.1000 కోట్లు ఇచ్చినప్పటికీ..ఇంకా కేంద్రం నుంచి బకాయిలు రావాల్సి ఉందన్నారు సీఎం కేసీఆర్. అక్బరుద్దీన్ చెప్తున్నది నూరుశాతం వాస్తవమేనని కేసీఆర్ సమర్థించారు. రాష్ర్ట హక్కుల ప్రకారం జీఎస్టీ బకాయిలు రాని పక్షంలో అందరూ మాట్లాడొచ్చని..దీనికి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయని తెలిపారు. దయచేసి ఎవరూ ఘర్షణ పడొద్దని..సామరస్యంగా చర్చించుకుందామని కేసీఆర్ సర్ది చెప్పారు.

సీఏఏ బిల్లుపై మాట్లాడుతూ..

అలాగే సీఏఏ, జీఎస్టీ విషయంలో ఏ పార్టీకి ఉండే అభిప్రాయాలు ఆ పార్టీకి ఉంటాయని..పార్టీ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టి చెప్పాల్సిన అవసరం ఉంటుందని కేసీఆర్ తెలిపారు. సీఏఏ బిల్లును పార్లమెంట్ లో టీఆర్ఎస్ వ్యతిరేకించిందని..అసెంబ్లీలో కూడా దీనిపై చర్చ జరగుతుందన్నారు. రాష్ర్ట ప్రభుత్వాల విజ్ఞప్తుల్ని కేంద్రం అంగీకరిస్తుందా లేదా అన్నది పక్కనపెడితే..ప్రస్తుతం దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సీఏఏ బిల్లుపై ఇక్కడ చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశ రాజధానిలో గతనెలాఖరులో జరిగిన అల్లర్లలో సుమారు 40-50 మంది మరణించారని, అలాంటి పరిస్థితి ఇక్కడ రాకుండా ఉండాలంటే చర్చ జరగాలన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలు, వారి ఆలోచనలను కేంద్రానికి తెలియజేయాల్సిన బాధ్యత పాలకులుగా మనపైనే ఉందన్నారు కేసీఆర్. కాగా..రాజాసింగ్ తో పాటు ఎవరికైనా ప్రజాస్వామ్యంలో భిన్నమైన అభిప్రాయాలుంటాయని, సీఏఏ విషయంలో బీజేపీకి ఒక అభిప్రాయం..మిగిలిన పార్టీలకు మరొక అభిప్రాయం ఉండటంలో తప్పులేదన్నారు. భిన్నాభిప్రాయాలు ఉండేదే ప్రజాస్వామ్యమని, అందరి అభిప్రాయాలు విన్నాకే సభలో సీఏఏపై చర్చ జరుగుతుందన్నారు. సీఏఏ విషయంలో చాలా అపోహలు, అనుమానాలు ఉన్నాయని..వాటన్నింటినీ నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.

అక్బరుద్దీన్ కు నా మనవి : కేసీఆర్

”ఇది చాలా ముఖ్యం. ఉద్రిక్త పరిస్థితులు సృష్టించొద్దు. ఒక్కరోజుతో తెగే సమస్య కాదు. భవిష్యత్ తరాలపై పడే ప్రభావంపై కూడా చర్చ జరగాలి. రాజాసింగ్ కు అవకాశమివ్వండి. ఆయన అభిప్రాయం కూడా వినాలి కదా. ఎంతసేపైనా ఓపికతో చర్చిద్దాం..కానీ అంతిమ న్యాయ నిర్ణేతలు మాత్రం ప్రజలే. ఎవరిది తప్పైతే ప్రజలు వారినే శిక్షిస్తారు.” అని సీఎం కేసీఆర్ అక్బరుద్దీన్ ను ఉద్దేశించి మాట్లాడారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.