ఆఫీస్ బాయ్ నుండి యూట్యూబ్ లో మిలియన్ ఫాలోవర్స్ దాకా..!
By రాణి Published on 26 Feb 2020 9:49 AM GMTఅందరి జీవితాల్లో ఎక్కడో ఒక్క చోట టర్నింగ్ పాయింట్ అన్నది ఉంటది. అప్పుడు ఆ జీవితాలే మారిపోతూ ఉంటాయి. ఇప్పుడొక ఆఫీస్ బాయ్ లైఫ్ లో కూడా ఊహించని మలుపు వచ్చింది. ఏకంగా యూట్యూబ్ లో మిలియన్ కు పైగా ఫాలోవర్లను సంపాదించి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. ఇంటర్మీడియెట్ డ్రాపవుట్ అయిన ఆ వ్యక్తి కంప్యూటర్ టెక్నాలజీ మీద తనకంటూ ఉన్న ఆసక్తిని వీడియోల రూపంలో ఆన్ లైన్ లో అప్లోడ్ చేయడం మొదలు పెట్టాడు. ఒక యూట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేసుకున్నాడు. అందులో కంప్యూటర్ కు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా వాటిని నివృత్తి చేయడం మొదలుపెట్టాడు. కొన్ని తనకు తెలిసిన విషయాలు చెప్పడం.. మరికొన్ని ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం చేస్తూ ఉండేవాడు. అలా ఇప్పుడు మిలియన్ కు పైగా సబ్స్క్రైబర్స్ ను సంపాదించుకుని ఆదాయాన్ని కూడా బాగా ఆర్జిస్తున్నాడు.
అతడి పేరు సయ్యద్ హఫీజ్, 33 సంవత్సరాల వ్యక్తి.. ఒకప్పుడు ఆఫీసు బాయ్ గా పనిచేశాడు. ఆ తర్వాత ఓ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ను ఏర్పాటు చేసాడు. అలాగే యూట్యూబ్ లో పలు వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉండేవాడు. గోదావరిఖని నివాసి అయినా హఫీజ్ 'Telugu Tech Tuts’ అనే యూ ట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేశాడు. 2014 లో ఈ యూ ట్యూబ్ ఛానల్ ను మొదలుపెట్టిన హఫీజ్.. ఇప్పటికి 11,40,000 పైగా సబ్ స్క్రైబర్స్ ను సంపాదించాడు. అది కూడా ఇంత తక్కువ సమయంలో అతడు మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.
యూత్ ఐకాన్ హఫీజ్
యూట్యూబ్ అతడికి 'గోల్డ్ ప్లే బటన్' ను అందించడం విశేషం. అలాగే 2017 లో 'సోషల్ మీడియా సమ్మిట్' అవార్డును సొంతం చేసుకున్నాడు హఫీజ్. ఇప్పుడు హఫీజ్ యూత్ ఐకాన్ గా మారాడు. తెలుగు రాష్ట్రాల్లోని యూత్ కు టెక్నాలజీకి సంబంధించిన డౌట్స్ ను తీరుస్తూ దూసుకుపోతున్నాడు. 2018లో ‘Telugu Tech Tuts’ యుట్యూబ్ ఛానల్ 10 లక్షల ఫాలోవర్స్ సాధించిన టాప్ యూ ట్యూబ్ ఛానల్ లో ఒకటిగా నిలిచింది. తాను ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు కాస్త డిఫరెంట్ గా చెప్తానని.. ఎదుటివారికి అర్థమయ్యే రీతిలో కావాల్సిన సమాచారాన్ని తాను అందిస్తానని అందుకే తన యూ ట్యూబ్ ఛానల్ సక్సెస్ అయిందని చెప్పాడు హఫీజ్.
యూ ట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం ఏమిటని హఫీజ్ ను అడుగగా.. తాను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తున్నప్పుడు విద్యార్థులు C, C++, Auto CAD లాంటివి నేర్చుకోడానికి చాలా కష్టపడేవారని.. వాళ్లకు చదువు చెప్పే వ్యక్తి ఇంగ్లీష్ లో ఎక్కువగా వివరణ ఇస్తూ ఉండడంతో విద్యార్థులకు సరిగా అర్థమయ్యేది కాదని హఫీజ్ తెలిపాడు. అలాంటి సమయంలో తనకు ఎటువంటి క్వాలిఫికేషన్ లేకపోయినా తాను వారి సందేహాలను నివృత్తి చేసే వాడినని హఫీజ్ తెలిపాడు. హఫీజ్ అంతకు ముందే C, C++, Auto CAD లాంటివి నేర్చుకోవడం వలన విద్యార్థులకు తెలుగులోనే అర్థమయ్యేలా వివరించడానికి సులువుగా ఉండేది. ఇక ఆ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఓనర్ నష్టాలను భరించలేక అమ్మేయడంతో హఫీజ్ ఉద్యోగం పోయింది.
గూగుల్ లో తెలుగు మెటీరియల్ దొరకక పోవడంతో..
కొద్ది రోజులు కష్టపడ్డాక 2006 లో ఓ చిన్న ఇన్స్టిట్యూట్ ను స్థాపించాడు. అందులో తనకు తెలిసిన పాత కోర్స్ లను భోధించేవాడు. కొద్దిరోజుల తర్వాత పిల్లలు కొత్త కోర్స్ లు కావాలని అడిగేవారు. గూగుల్ మొత్తం వెతికినా తెలుగులో మెటీరియల్ లభించలేదు. దీంతో తానే తెలుగులో సబ్జెక్టు ను బోధిస్తే బాగుందన్న ఆలోచన అతడికి వచ్చింది. వెంటనే వీడియోలు తయారు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులకు తన వీడియోలు సహాయపడాలి అనే ఉద్దేశ్యంతో యూ ట్యూబ్ ఛానల్ ను మొదలుపెట్టాడు హఫీజ్. వెబ్సైట్ లలో హిందీ, ఇంగ్లీష్ లో ఉన్న కొత్త కోర్సులకు సంబంధించిన సమాచారాన్ని హఫీజ్ సేకరించి తెలుగులో అందరికీ అర్థం అయ్యేలా చెప్పేవాడు.
MS Word, Excel, Power Point, C, C++, Auto CAD లాంటి కోర్సులకు సంబంధించిన వీడియోలు హఫీజ్ యూ ట్యూబ్ లో అప్లోడ్ చేయగా.. అవి మంచి హిట్స్ సాధించాయి. ఎంతో మందికి ఉపయోగపడ్డాయి. హఫీజ్ ఇప్పుడు మొబైల్ ఫోన్స్ గురించి నెటిజన్లకు తగినన్ని సూచనలు ఇవ్వడం మొదలుపెట్టాడు. మొబైల్ ఫోన్స్ లో లేటెస్ట్ టెక్నాలజీ ఉందా లేదా, ఫేక్ వెబ్ సైట్స్ ను గుర్తించడం ఎలా.. లాంటి ఎన్నో విషయాలను తన యూ ట్యూబ్ ఛానల్ లో చెప్పుకుంటూ వస్తున్నాడు హఫీజ్. అతడి యూ ట్యూబ్ ఛానల్ లో ఇప్పటివరకూ 3500 పైగా వీడియోలను అప్లోడ్ చేశాడు. ఆఫీసు బాయ్ నుండి యూ ట్యూబ్ లో ఎంతో మందికి తగినంత సమాచారం ఇచ్చే స్థాయి వరకూ హఫీజ్ ఎదిగిన తీరు నిజంగా ఆదర్శప్రాయం.