వైజాగ్ వ‌న్డే మ‌న‌దే.. క‌ట‌క్‌లో పైన‌ల్ ఫైట్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Dec 2019 4:19 PM GMT
వైజాగ్ వ‌న్డే మ‌న‌దే.. క‌ట‌క్‌లో పైన‌ల్ ఫైట్..!

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వైజాగ్‌లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం వేదికగా విండీస్‌తో జరుగుతున్న రెండ‌వ‌ వన్డేలో టీమిండియా భారీ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్.. ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లు శుభారంభం అందించారు.

విండీస్ బౌలర్లను ఓ రేంజ్‌లో ఆడుకున్న రోహిత్, రాహుల్‌ల‌ జోడి పరుగుల వరదపారించారు. కేఎల్ రాహుల్(102) రోహిత్(159) సెంచ‌రీల‌తో క‌దంతొక్క‌గా.. కోహ్లీ మాత్రం ఖాతా తెర‌వ‌లేదు. ఓపెన‌ర్ల సెంచ‌రీల‌కు తోడు పంత్, అయ్య‌ర్ ల మెరుపులు కూడా తోడ‌వ్వ‌డంతో భార‌త్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది.

భారీ ల‌క్ష్యంతో చేద‌న‌కు దిగిన విండీస్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. అయితే మ‌రో వికెట్ ప‌డ‌కుండా హోప్, పూరన్‌ల జోడీ అండగా నిలిచింది. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కి 106 పరుగులు జోడించారు. ఆ తర్వాత షమీ వేసిన 30వ ఓవర్‌లో పూరన్, పొలార్డ్ వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు.

అనంతరం కుల్దీప్ యాదవ్ వెస్టిండీస్‌కి ఝలక్ ఇచ్చాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 33వ ఓవర్‌లో హ్యాట్రిక్ సాధించి విండీస్ న‌డ్డి విరిచాడు. దీంతో కుల్దీప్ అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు హ్యాట్రిక్‌లు సాధించిన తొలి బౌలర్‌గా అతను రికార్డు సృష్టించాడు. భారత బౌలర్ల దెబ్బకి వెస్టిండీస్ 43.3 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌట‌య్యింది. భార‌త బౌల‌ర్ల‌లో ష‌మీ మూడు, జ‌డేజా రెండు వికెట్లు ప‌డ‌గొట్టగా.. శార్దుల్ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు. భారీ సెంచ‌రీతో అద‌ర‌గొట్టిన రోహిత్‌శ‌ర్మ‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల‌భించింది.

Next Story