ఉపాధ్యాయులను అడ్డుకున్న పోలీసులు.. చలో అసెంబ్లీ ఉద్రిక్తం

By Newsmeter.Network  Published on  13 March 2020 7:01 AM GMT
ఉపాధ్యాయులను అడ్డుకున్న పోలీసులు.. చలో అసెంబ్లీ ఉద్రిక్తం

పీఆర్‌సీ, పాత పింఛను విధానం అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తతంగా మారింది. అసెంబ్లీ వైపు వెళ్తున్న వారిని అడ్డుకోవటంతో పోలీసులకు, ఉపాధ్యాయ సంఘాల నేతలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా తొలుత ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్‌ వద్దకు ఉపాధ్యాయులు భారీగా చేరుకున్నారు. అక్కడి నుండి అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరడంతో అప్పటికే అక్కడేభారీగా మోహరించి ఉన్న పోలీసులు ఉపాధ్యాయులను అడ్డుకున్నారు.

వారిని అక్కడనుంచి కదలనివ్వకుండా అడ్డుకోవటంతో పోలీసులు, ఉపాధ్యాయులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఉపాధ్యాయులు పోలీసులను తోసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ప్రతిఘటించారు. ఇరువురి మధ్య తోపులాట చోటు చేసుకోవటంతో పరిస్థితి ఉధ్రిక్తంగా మారింది. దీంతో వారు ఇందిరాపార్క్ వద్దే బైఠాయించి తమ నిరసన తెలిపారు. పులువురి ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

మరోవైపు అసెంబ్లీ గన్‌పార్క్ వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. టాస్క్ ఫోర్స్‌, లా అండ్‌ ఆర్డర్‌, స్పెషల్‌ పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటుచేసిన పోలీసులు ర్యాలీలు, నిరసనలు, సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉపాధ్యాయులను ముందస్తు అరెస్టు చేశారు. టీచర్లు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి లేదంటూ అదుపులోకి తీసుకున్నారు. జనగామ జిల్లాలో 23మంది టీచర్లను అదుపులోకి తీసుకోగా, ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా, నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురి ఉపాధ్యాయులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు

Next Story