బాడీని మొత్తం బైటికి చూపించిన స్కూల్ టీచర్
By Newsmeter.Network Published on 25 Dec 2019 4:05 PM ISTముఖ్యాంశాలు
- ఫుల్ బాడీ సూట్ ధరించి స్పానిష్ టీచర్ పాఠాలు
- కొత్త తరహాలో పాఠాలు చెబుతున్న వెరోనికా డ్యూక్
- బయాలజీ పాఠాలు చెప్పడానికి వినూత్న ప్రయోగం
- ధరించిన స్విమ్ సూట్ పై శరీరంలోని అవయవాలు
- పూర్తిగా అవయవాల బొమ్మలతో కూడిన స్పెషల్ సూట్
- ఇంటర్ నెట్ లో సెర్చ్ చేస్తుండగా కనిపించిన బాడీ సూట్
- ఎప్పుడూ క్రియేటివిటీకి పెద్ద పీట వేసే వెరోనికా డ్యూక్
ఓ స్కూల్ టీచర్ పిల్లలకు పాఠాలు చెప్పేందుకు ఆకాశమే హద్దుగా తన క్రియేటివిటీని ప్రదర్శించింది. బయాలజీ పాఠాలను కళ్లకు కట్టేట్టుగా వివరించేందుకు ఓ వినూత్న విధానాన్ని అవలంబించింది. టీచర్ ఉన్నట్టుండి ఆ ఆహార్యంలో కనిపించేసరికి క్లాసులో పిల్లలు ఆశ్చర్యపోయారు. ఔరా! అని నోరు తెరుచుకుని అలా బయాలజీ పాఠాలు వింటూ ఉండిపోయారు. పాఠం పూర్తైన తర్వాత పిల్లలందరూ ఆ టీచర్ ని అభినందనలతో ముంచెత్తారు. ఇంతకు ముందు ఎవరూ ఇంత అందంగా, ఇంత అర్థమయ్యేట్టుగా మాకు పాఠాలు చెప్పలేదంటూ పొగడ్తల వర్షం కురిపించారామె మీద.
ఓ స్పానిష్ స్కూల్ టీచర్ కి వచ్చిన ఈ ఆలోచన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. బయాలజీ టీచర్ గా పనిచేస్తున్న వెరోనికా డ్యూక్ ఓ రోజున ఇంటర్ నెట్ లో సెర్చ్ చేస్తుండగా ఫుల్ బాడీ ఆర్గాన్స్ ఆసక్తికరంగా కనిపించేలా డిజైన్ చేసిన ఓ సూట్ ఆమె కంటపడింది. వెంటనే ఆమె ఆ సూట్ ని కొనేసి, దాన్ని వేసుకుని క్లాస్ కెళ్లి బ్లాక్ బోర్డ్ మీద వివరాలు రాస్తూ, తన శరీరానికి అంటిపెట్టుకుని ఉన్న సూట్ లో కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్న శరీర అవయవాలను, అంతర్గత భాగాలను చూపిస్తూ ఎంచక్కా పాఠం చెప్పేసింది.
ప్రయోగాత్మకంగా పాఠాలు చెప్పడం
పిల్లలకు అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పడం అంటే.. తనకు ముందునుంచీ చాలా ఇష్టం. వెరోనికా క్లాసులో ఓ సారి పాఠం చెబితే చాలు పిల్లలు ఇంటికెళ్లాక మళ్లీ పుస్తకం తెరిచి బట్టీ పట్టాల్సిన అవసరమే ఉండదు. మొదట్నుంచీ ఆమెకు పిల్లలకు బాగా నచ్చే రీతిలో, అర్థమయ్యే రీతిలో ప్రయోగాత్మకంగా పాఠాలు చెప్పడం అలవాటు.
టీచింగ్ వృత్తిలో ఆరేళ్ల అనుభవం ఉన్న వెరోనికా మూడో తరగతి పిల్లలకు సైన్, ఇంగ్లిష్, ఆర్ట్, సోషల్ స్డడీస్, స్పానిష్ పాఠాలు చెబుతుంది. నిజానికి ఆమెకు ఇంటర్ నెట్ లో కనిపించిన బాడీ అర్గాన్స్ ని చూపించే సూట్ స్విమ్ సూట్. ఏదైతే ఏంటి పిల్లలకు పూర్తిగా సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పడమే నాకు కావాలి అనుకున్న ఈ టీచర్ ఆ స్విమ్ సూట్ నే ధరించి క్లాస్ కెళ్లి, పాఠాలు చెప్పేసింది.
వెరోనికా భర్త ఆమెతో పాటుగా స్కూల్ కెళ్లి, క్లాసులో ఆమె పాఠాలు చెబుతున్న సమయంలో కొన్ని చక్కటి ఫోటోలు తీసి వాటిని సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. వెంటనే వెరోనికా చేసిన పనిని మెచ్చుకుంటూ నెటిజన్లు లైకులు, ట్వీట్లు ఇబ్బడిముబ్బడిగా చేసేశారు. పదమూడు వేల పైచిలుకు ట్వీట్స్, 66 వేల పైచిలుకు లైక్స్ వెరోనికా భర్త చేసిన ట్విట్ కు వచ్చాయంటే ఆమె చేసిన పని ఎంతమందికి నచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
తన భార్య ముందునుంచీ చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తుందనీ, తనకు అంత వినూత్నతరహాలో ఆలోచించే అర్థాంగి దొరకడం ఎంతో సంతోషంగా ఉందనీ వెరోనికా భర్త మురిసిపోతున్నాడు. నెటిజన్లనుంచి వెల్లువెత్తుతున్న అభిమానానికి ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు.
ఆ స్విమ్ సూట్ పూర్తిగా ఆమె శరీరానికి అతుక్కుని ఉన్నట్టుగా లేదంటూ కొందరు, కొంచెం చిన్నసైజ్ అయితే బాగుండేదంటూ మరికొందరు చిలిపి కామెంట్లు చేసినప్పటికీ ఎక్కువమంది మాత్రం పిల్లలకు చక్కగా అర్థమయ్యేలా పాఠాలు చెప్పేందుకు తను అనుసరించిన మార్గాన్ని భలేగా మెచ్చుకున్నారు.
వెరోనికా ఇలా అడ్వాన్స్ టీచింగ్ మెథడ్స్ ని అడాప్ట్ చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆమె చరిత్ర పాఠాలు చెప్పేందుకు తనే ప్రత్యేకంగా చారిత్రక అంశాలకు చెందిన నమూనాలను తయారుచేసుకుని మరీ క్లాస్ కు వెళ్లేది. అలాగే ఇంగ్లిష్ గ్రామర్ టీచ్ చేసేటప్పుడు నౌన్స్, అడ్జెక్టివ్స్, వెర్బ్స్ ఉపయోగం చాలా సులభంగా పిల్లలకు అర్థమయ్యే రీతిలో ప్రత్యేకంగా చార్ట్స్ ని డిజైన్ చేసి వాటి సాయంతో పిల్లలకు పాఠాలు చెప్పేది.
సమాజంలో టీచర్లపట్ల అన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేయాలన్నదే తన లక్ష్యమని వెరోనికా చెబుతోంది. “టీచర్లకేం పనుండదు! ఏవో నాలుగు పాఠాలు చెప్పేసుకుని జీవితాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు! వాళ్లకు బోల్డంత ఖాళీ సమయం ఉంటుంది! ఖాళీ సమయంలో వాళ్లు గప్పాలు కొట్టేస్తారు!” లాంటి సర్వసాధారణంగా వినిపించే కామెంట్లకు పూర్తిగా పుల్ స్టాప్ పెట్టేందుకు తను వినూత్న రీతుల్లో, వివిధ రకాల వైవిధ్యభరితమైన మెథడ్స్ లో పాఠాలు చెబుతున్నానంటోందీ అందమైన, ముచ్చటైన, తెలివైన టీచరమ్మ.