వైసీపీ పాలనకు నిరసనగా టిడిపి నేతల ర్యాలీ
By రాణి
వెలగపూడి : రాష్ర్టంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ టిడిపి నేతలు మంగళవారం సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. అసెంబ్లీ సమావేశం ప్రారంభానికి ముందు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్లకార్డులు చేపట్టి రాష్ర్టంలో పోలవరం ప్రాజెక్టు పనుల నిలిపివేత, ఇసుక కష్టాలు, టిడిపి నేతలపై దాడులు తదితర అంశాలపై నిరసన తెలిపారు.
ఇసుక కొరతతో రాష్ర్టంలో నిత్యం కూలీ చేసుకుని బ్రతికే కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయని, వెంటనే ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తక్షణమే నదుల అనుసంధాన ప్రక్రియ చేపట్టాలని నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ర్టంలో అభివృద్ధి కుంటుపడిందని, కేవలం రాజకీయ కక్షసాధింపే లక్ష్యంగా ప్రస్తుత ప్రభుత్వ విధానాలు సాగుతున్నాయని ఆరోపించారు. సీఎం జగన్ తమ పార్టీ నాయకులపై దాడులు చేయిస్తూ రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ తో పోలవరం ఎప్పటికి పూర్తవుతుందోనని చంద్రబాబు ఆందోళన చెందారు.
మాజీ మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ...మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన దిశ చట్టం ప్రయోగించేందుకు రాష్ర్ట ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకాడకూడదన్నారు. ఇకపై ఏ మహిళపై దాడులు జరిగినా వారిని దిశ చట్టం ద్వారా శిక్షించాలని, నిందితులెవరైనా సరే శిక్ష అందరికీ ఒకేలా ఉండాలని చినరాజప్ప అన్నారు. నేరస్తుల్లో తమ కులం వారున్నారన్న వివక్షను ముఖ్యమంత్రి చూపరాదని ఎద్దేవా చేశారు. గోరంట్ల బుచ్చయ్య మాట్లాడుతూ రాష్ర్ట వ్యాప్తంగా జే ట్యాక్స్ వసూళ్లు భారీగా ఉన్నాయని, ప్రధానంగా సిమెంట్, మద్యం వసూళ్లే ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. అలాగే పలువురు మంత్రులు మైనింగ్ లో భారీ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.