అమరావతి : సొంత పార్టీ ఎమ్మెల్సీల నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఊహించని షాక్‌ తగిలింది. అమరావతిలో ఆదివారం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీఎల్పీ భేటీ అయ్యింది. కాగా ఆరుగురు మండలి సభ్యులు ఈ సమావేశానికి గైర్హజ‌ర‌య్యారు. వీరిలో గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల విజయరామరాజు, ఏఎస్ రామకృష్ణ, శమంతకమణి ఉన్నారు. క‌నీస స‌మాచారం ఇవ్వ‌కుండా వీరు స‌మావేశానికి హ‌జ‌రుకాక‌పోవ‌డం ప్ర‌స్తుతం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

మూడు రాజ‌ధానిల నిర్ణ‌యాన్ని చంద్ర‌బాబు తీవ్రంగా వ్య‌తిరేకిస్తుండ‌గా టీడీపీలోని ఉత్త‌రాంధ్ర‌, రాజ‌సీమ కు చెందిన నేత‌లు ప‌లువురు చంద్ర‌బాబు నిర్ణ‌యం ప‌ట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ విష‌యమై బ‌హిరంగంగా ఎవ్వ‌రూ విమ‌ర్శ‌లు చేయ‌క‌పోయిన‌ప్ప‌టికి స్థానిక ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుండ‌డంతో పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోతుల సునీత, శివనాథ్‌రెడ్డిలు పార్టీ విధానాలపై బహిరంగంగానే విమర్శలకు దిగారు. మరో సీనియర్‌ సభ్యుడు డొక్కా మాణిక్యవర ప్రసాద్‌ మండలి పదవికి ఇప్పటికే రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే.

మరోవైపు శాసన మండలిలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో చంద్రబాబును నమ్మి మోసపోయాయని, కొరివితో తలగొక్కున్నట్లైందని టీడీపీ సభ్యులు వాపోతున్నారు. మండలిని రద్దు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడంతో టీడీపీ ఎమ్మెల్సీలు అంతర్మథనంలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనలో ఉన్న టీడీపీ ఎమ్మెల్సీల్ని బుజ్జగించేందుకు చంద్రబాబు రెండ్రోజులుగా ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ నేటీ భేటీకి టీడీపీ ఎమ్మెల్సీలు దూరంగా ఉన్నారు. నిరాశకు గురిచేసింది.

Newsmeter.Network

Next Story