దిశ చట్టం అమలు నాతోనే మొదలు పెట్టండి : మహిళా ఎమ్మెల్యే

By రాణి  Published on  17 Dec 2019 8:18 AM GMT
దిశ చట్టం అమలు నాతోనే మొదలు పెట్టండి : మహిళా ఎమ్మెల్యే

వెలగపూడి : ఆఖరి రోజు అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అసెంబ్లీలో భావోద్వేగానికి గురయ్యారు. సోమవారం మద్యం పాలసీ పై భవానీ మాట్లాడారు. ఆ తర్వాత సంబంధిత మంత్రి, స్పీకర్ తమ్మినేని ఆమె అడిగిన వాటికి బదులిచ్చారు. మంగళవారం మరోసారి ఆమె అసెంబ్లీలో మాట్లాడుతూ..మద్యం పాలసీపై మాట్లాడే హక్కు నాకు లేదా ? అని ప్రశ్నించారు. మద్యం పాలసీపై మాట్లాడితే దాని గురించి మీకెందుకు అని స్పీకర్ కూడా అంటున్నారని భవాని ఆరోపించారు. తను అనని మాటలు కూడా అన్నట్లుగా వక్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, సదరు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ' నాపై ట్రోల్ చేసినవారిలో వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. దిశ చట్టం అమలు నాతోనే మొదలు పెట్టండి' అని స్పీకర్ ను ఎమ్మెల్యే భవాని కోరారు.

సోమవారం ఎమ్మెల్యే భవాని అసెంబ్లీ ఇలా మాట్లాడారు

రాష్ర్టంలో మద్యం విక్రయాలు బాగా పెరిగిపోయాయని, తాగుబోతుల చేష్టలతో మహిళలుచాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వైన్ షాపులు, బార్లను నివాస ప్రాంతాలకు దూరంగా ఉంచాలని అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ప్రభుత్వం కమిషన్ తీసుకుని కొన్ని రకాల మందు బ్రాండ్లను మాత్రమే వైన్ షాపుల్లో ఉంచుతుందని చెప్పేందుకు ప్రయత్నించగా...మహిళా ఎమ్మెల్యే మందు బ్రాండ్ల పేర్లను చదవడంతో తోటి ఎమ్మెల్యేలు నవ్వు ఆపుకోలేకపోయారు. తోటి సభా సభ్యులు ముసిముసి నవ్వులు నవ్వడంతో భవానీ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. ఇది గమనించిన స్పీకర్ తమ్మినేని సీతారాం.."మందు బ్రాండ్ల గురించి నీకెందుకురా తల్లి, వాళ్లు మాట్లాడుతారు వదిలేయ్" అని చెప్పారు.

Next Story