''ఏపీ దిశ'' బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

By రాణి  Published on  13 Dec 2019 9:37 AM GMT
ఏపీ దిశ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ఏపీ దిశ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ దిశ (ఏపీ క్రిమినల్ లా సవరణ) బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. అనంతరం ఈ బిల్లులో చేసిన సవరణల గురించి సభా సభ్యులకు వివరించారు. వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకే విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు జగన్ వెల్లడించారు. తెలంగాణ రాష్ర్టంలో జరిగిన దిశ ఘటనలు వంటివి ఇక్కడ జరుగకుండా ఈ బిల్లును తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఘటనలకు బ్రేక్ వేసేలా ముందడుగు వేస్తున్నామన్నారు. మహిళలు, పిల్లలపై జరిగే అఘాయిత్యాలపై స్పెషల్ కోర్టుల్లో విచారణ జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, స్పెషల్ పోలీస్ టీమ్ లను ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు జగన్.

నిందితుల‌కు త్వ‌ర‌గా శిక్ష ప‌డేందుకు ఈ చ‌ట్టం ఉప‌యోగం

''భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 354కు సవరణలు చేసి కొత్తగా 354-ఈ చేర్చింది. ఈ చట్టం ద్వారా అత్యాచారానికి పాల్పడిన ఆధారాలు ఉన్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెలువడనుంది. వారం రోజుల్లోగా విచారణ పూర్తిచేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి రెండు వారాల్లోగా ట్రయల్ పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చేయడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. అత్యాచారాలకు పాల్పడినట్లు ఖచ్చితమైన ఆధారాలుంటే నిందితులకు మూడు వారాల్లోగా ఉరిశిక్ష విధించడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లు రూపొందింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు తదితర నేరాలకు సత్వరమే విచారణ చేసేందుకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది''. అని తెలిపారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇక సోషల్ మీడియాలో మహిళలపై మొదటిసారి తప్పుగా పోస్టింగ్ పెడితో రెండేళ్ల పాటు జైలు శిక్ష, రెండోసారి పెడితే నాలుగేళ్లు జైలు శిక్ష, చిన్నారులను లైంగికంగా వేధిస్తే 7-14 ఏళ్లు జైలు శిక్ష అమలు చేస్తామని జగన్ పేర్కొన్నారు.

చంద్ర‌బాబు ప‌రిపాల‌న‌లో జ‌రిగిన నేరాలు

2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు పరిపాలనలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలు, నేరాల లెక్కలను జగన్ అసెంబ్లీలో చెప్పారు. 2014లో మహిళలపై జరిగిన నేరాల సంఖ్య 13,549, 2015లో మహిళలపై నేరాల సంఖ్య 13,088, 2016లో మహిళలపై నేరాలు 13,948, 2017లో మహిళలపై నేరాలు 14,696, 2018లో మహిళలపై నేరాలు 14,048. వీటిలో వరకట్న హత్యలు, వేధింపులు, హత్యలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, అపహరణలు, బహుభార్యత్వం కేసులు ఉన్నాయి. అలాగే 2014లో జరిగిన అత్యాచారాలు 937, 2015లో 1014, 2016లో 969, 2017లో 1046, 2018లో 1096, మందిపై అత్యాచారాలు జరిగాయని వివరించారు. చిన్నారులపై జరిగిన దారుణాలు చూస్తే 2014లో 4,032 కేసులు, 2015లో 4114, 2016లో 4,477, 2017లో 4,672, 2018లో 4,215 కేసులు నమోదయ్యాయి. ఇలా పోలీసుల దృష్టికి రాని కేసులెన్నో ఉన్నాయని జగన్ తెలిపారు. బహుభార్యత్వం కలిగిన కేసులు 2014లో 216, 2015లో 264, 2016లో 240, 2017లో 262, 2018లో 195 నమోదైనట్లు పేర్కొన్నారు.

ఫోక్సో యాక్ట్‌ ప్రకారం నమోదైన కేసులు చూస్తే

ఫోక్సో యాక్ట్‌ ప్రకారం నమోదైన కేసులు చూస్తే.. ఎంతటి దారుణమైన పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉందో అర్థం అవుతుందన్నారు.

2016లో పోక్సో యాక్ట్‌ ప్రకారం 830 కేసులు, 2017లో 1069, 2018లో 1229 కేసులు నమోదయ్యాయని జగన్ వివరించారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమర్థించారు. ఒక అమ్మాయి పట్ల మూర్ఖంగా ప్రవర్తించి ఆమె పై అత్యాచారం చేయడమే కాకుండా సజీవంగా తగలబెట్టిన మృగాలను మట్టుబెట్టించిన తెలంగాణ సీఎం కేసీఆర్ కు మరోసారి హాట్స్ఆఫ్ చెప్పారు.

Next Story