దండుపాళ్యం బ్యాచ్‌ వస్తోంది...జాగ్రత్త : కూన రవికుమార్‌

By రాణి  Published on  26 Dec 2019 12:41 PM GMT
దండుపాళ్యం బ్యాచ్‌ వస్తోంది...జాగ్రత్త : కూన రవికుమార్‌

ముఖ్యాంశాలు

  • ఉత్తరాంధ్ర సహజ సంపద, విశాఖ భూముల కోసమే మూడు రాజధానుల ఎత్తుగడ
  • ప్రకృతి వనరుల్ని కొల్లగొట్టడానికే విశాఖపై కన్ను
  • దండుపాళ్యం బ్యాచ్‌ గో బ్యాక్‌...జగన్‌ గో బ్యాక్‌
  • జగన్మోహన్‌రెడ్డి అనే గ్రహణాన్ని వదిలించుకోవాలంటే ప్రజా తిరుగుబాటే మార్గం
  • ప్రభుత్వ నిర్ణయాలు ప్రకటించే అధికారం విజయసాయిరెడ్డికి ఎవరిచ్చారు?
  • మాజీ విప్ కూన రవికుమార్‌

మూడు రాజధానుల ముసుగులో ప్రశాంతతకు నిలయమైన విశాఖ నగరాన్ని అరాచకాలు, విధ్వంసాల కేంద్రంగా మార్చడానికి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని సహజ సంపదను స్వాహా చేయడానికి, తండ్రి హయాంలో విశాఖకేంద్రంగా అడ్డగోలుగా కాజేసిన భూములను కాపాడుకోవడానికి దండుపాళ్యం బ్యాచ్‌ వైజాగ్‌కు వస్తోందని..అందరూ జాగ్రత్తగా ఉండాలని టీడీపీనేత, మాజీ విప్‌ కూన రవికుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఆత్మకూరులోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

సెటిల్‌మెంట్లు, దందాలు చేయడమే పనిగా పెట్టుకున్న విజయసాయిరెడ్డి, తనపేరుతో ఎవరైనా తప్పుడు పనులు చేస్తే, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. అతని కంటే ఘనుడు ఆచంటమల్లన్న అన్నతీరుగా భూ కబ్జాలు, దందాలు, దోపిడీల్లో విజయసాయి రెడ్డి జగన్‌ని మించిపోయాడని కూన తెలిపారు. వారిద్దరికీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తూతూ మంత్రంగా సిట్‌ విచారణతో సరిపెట్టకుండా, వైఎస్‌ హయాంలో నొక్కేసిన భూములు, ఆస్తులతోపాటు, ఈ ఆరు నెలల్లో చేసిన భూ కుంభ కోణాలపై తక్షణమే సీబీఐ విచారణ కోరాలని రవికుమార్‌ డిమాండ్‌ చేశారు.

పులివెందుల పంచాయతీల్లో భాగంగా నరేష్‌కుమార్‌ అనే వ్యక్తిని బెదిరించడం ద్వారా విశాఖలో తమపాలన ఎలా ఉంటుందనే దానికి సంకేతంగా జగన్‌ అండ్‌ గ్యాంగ్ ఇప్పటికే టీజర్‌ను విడుదల చేసిందన్నారు. రాబోయే రోజుల్లో పులివెందుల పంచాయతీల కేంద్రంగా విశాఖ మారబోతోందని, ఈ రోజు వచ్చిన సూర్యగ్రహణం 3 గంటల్లో ముగిసింది కానీ రాష్ట్రానికి పట్టిన జగన్‌ అనే గ్రహణం పోవడానికి ఇంకా 4ఏళ్ల 4నెలల సమయం ఉందని కూన రవికుమార్ విమర్శించారు. జగన్మోహన్‌రెడ్డి అనే గ్రహణాన్ని వదిలించుకోవాలంటే రాష్ట్ర ప్రజలు తిరుగుబాటు చేయడం తప్ప మరోమార్గం లేదని కూన తేల్చిచెప్పారు. జగన్‌ ఏం ఘనకార్యం చేశాడని విశాఖ వాసులు ఆయనకు స్వాగతం చెప్పడానికి అని ప్రశ్నించారు.

ఏ అధికారంతో ప్రభుత్వ పాలనా నిర్ణయాలను విజయసాయి వెల్లడిస్తున్నాడు ?

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని భూముల ఆక్రమణకు తెరలేపిన జగన్‌, దాన్ని కొనసాగించడానికే మూడు రాజధానుల ప్రకటన చేశాడని, అందులో భాగంగానే విశాఖలో పాగా వేస్తున్నాడని కూన దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర సంపదను, విశాఖ భూముల్ని కాజేయడానికి వస్తున్న జగన్‌కి ఆయన బృందానికి వ్యతిరేకంగా ఆ ప్రాంతవాసులంతా నిరసన వ్యక్తం చేయాలని కూన పిలుపునిచ్చారు. గో బ్యాక్‌ దండుపాళ్యం బ్యాచ్‌..గో బ్యాక్‌ జగన్‌ పేరుతో ఉత్తరాంధ్ర వాసులు, మరీ ముఖ్యంగా విశాఖ వాసులు చేసే నినాదాలతో ఉత్తరాంధ్ర ప్రతిధ్వనించాలన్నారు.

ఏ అధికారంతో విజయసాయి నిర్ణయాలు ప్రకటిస్తున్నాడు ? ఎంపీ అయిన విజయసాయిరెడ్డి ఏ అధికారంతో ప్రభుత్వ పాలనా నిర్ణయాలు వెల్లడిస్తున్నాడు ? అని కూన ప్రశ్నించారు. విజయసాయి తన అజమాయిషీ చలాయిస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశిస్తున్నాడో, అదే అధికారాన్ని ఉపయోగించి విశాఖ కేంద్రంగా భూ కబ్జాలకు తెరలేపాడన్నారు. భూ కబ్జాలకు ఆద్యుడైన విజయసాయి తన పేరుతో ఎవరైనా దందాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీచ్‌ శాండ్‌ వ్యాపారం పేరుతో 175కి.మీటర్ల శ్రీకాకుళం తీరప్రాంతానికి చేసిన విజ్ఞప్తులను జగన్‌ ప్రభుత్వం నిలిపివేసి, ఆ వ్యాపారాన్నితక్షణమే జిల్లా యువతకు కేటాయించాలని టీడీపీనేత కూన రవి డిమాండ్ చేశారు.

అమరావతిని ఢమాబుస్సుల సీతారాం కాపాడాలి

ప్రభుత్వ స్థలంలోని 18 ఎకరాల శాంతినికేతన్‌ స్థలాన్ని కాజేసి, 5 స్టార్‌హోటల్‌ కట్టాలన్న ఆలోచనలో విజయసాయి ఉన్నాడన్నారు. కొన్నివేలఎకరాలు ఒకరిద్దరికిందే ఉన్నాయని, టైటాని యం బాగోతంలో కేవీపీ.రామచంద్రరావు ఇప్పటికే అంతర్జాతీయ న్యాయస్థానాల్లో ముద్దాయిగా ఉన్నాడన్నారు. జిల్లాలోని ఆముదాలవలసలో ప్రభుత్వ పరిపాలనా భవనాలు ఏర్పాటుచేసేలా, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, స్పీకర్‌గా ఉన్న (ఢమాబుస్సుల) తమ్మినేని సీతారామ్‌ జగన్‌పై ఒత్తిడి తేవాలని కూన సూచించారు. సీతారామ్‌, ధర్మాన సోదరులు. వారిద్దరూ దాదాపు 24 ఏళ్ల పాటు మంత్రులుగా ఉండి తమ జిల్లాకు ఏం వెలగబెట్టారో, ఏ విధమైన అభివృద్ధి చేశారో సమాధానం చెప్పాలని రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా ప్రజలకు కనీస అవసరాలు కూడా లేవన్న విషయాన్ని వారు ఎందుకు తెలుసుకోవడం లేదని ప్రశ్నించారు.

విశాఖకు రాజధాని వస్తే, శ్రీకాకుళం ఎలా అభివృద్ధిలోకి వస్తుందో ఢమాబుస్సుల సీతారామ్‌ సమాధానం చెప్పాలన్నారు. జిల్లావాసులపై ఆయనకు ఏమాత్రం అభిమానమున్నా, తమజిల్లాలోనే సచివాలయ కేంద్రం, ఇతరపాలనా కార్యలయాలు ఉండేలా, 27న జరిగే కేబినెట్‌లో ఈ విషయం చర్చకువచ్చేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రజల్ని ఇప్పటివరకు భ్రమల్లో ముంచితేల్చిన జగన్‌, ఇప్పుడు అవేభ్రమల్ని ఉత్తరాంధ్రవాసులపై విసురుతూ, వారిని మోసంచేయడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు.

Next Story
Share it