మంగళగిరి : అసెంబ్లీలో అధికార పక్షం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. బుధవారం సాయంత్రం గుంటూరు జిల్లా మంగళగిరిలో గల పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు అసెంబ్లీలో ప్రభుత్వ వ్యవహార శైలిపై నిప్పులు చెరిగారు. ప్రజలు మీకు పట్టం కట్టింది అన్యాయం చేయడానికి కాదని హితవు పలికారు. తమ పార్టీ నేతలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే సరైన సమాధానమివ్వకుండా వ్యక్తిగత వ్యవహారాలు మాట్లాడుతున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ర్టంలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నారు. దీనిపై చర్చించేందుకు అవకాశమివ్వాలని కోరినప్పటికీ అధికార పక్షం, స్పీకర్ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఆనాటి ప్రభుత్వంపై ఆరోపణలు చేసినప్పుడు కూడా కనీసం తిరిగి సమాధానం చెప్పే సమయం కూడా ఇవ్వడం లేదన్నారు చంద్రబాబు.

వైసీపీ నేతలు అధికారం ఉందన్న అహంకారం చూపిస్తున్నారని, స్పీకర్ వ్యవహరిస్తున్న తీరు కూడా సరైనది కాదని సూచించారు చంద్రబాబు. కిలో ఉల్లి కోసం జనం గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వానికి వినిపించడం లేదని, తాము మాట్లాడాలన్న అడ్డుపడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. అంతేకాక ఆర్టీసీ ఛార్జీలు కూడా దారుణంగా పెంచేశారని, పల్లె వెలుగులో రూ.5 ఉండే టికెట్ ధరను రూ.10 చేశారని ఆరోపించారు. ఇలాగైతే బస్సుల్లో నిత్యం ప్రయాణించే 70 లక్షల మంది ప్రయాణికుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఛార్జీల పెంపుపై సభలో చర్చించాలని కోరినా పట్టించుకోలేదని ఆవేదన చెందారు. గత అసెంబ్లీ సమావేశాల్లో మేం ప్రతిపక్షం మాట్లాడేందుకు ఎక్కువ అవకాశాలిచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు.

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే రూ.336 కోట్లను సిద్ధం చేశామన్నారు. బాధితుల కోసం కృషి చేస్తే హాయ్ లాండ్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీలాగే అందరినీ నేరస్తులు అనుకోకూడదంటూ జగన్ పై పరోక్షంగా సెటైర్ వేశారు. అసెంబ్లీలో మాకు మైక్ ఇస్తే ఎక్కడ వారు చేసిన కుట్రలు, అవినీతి పనులన్నీ బయటపడతాయోమోనని భయపడతున్నారని చంద్రబాబు యద్దేవా చేశారు.

రాష్ర్టంలో అభివృద్ధి పనులు గడప దాటడం లేదు గాని జగన్ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని విమర్శించారు చంద్రబాబు. సీమకు నీరివ్వాలని తొలిసారిగా సంకల్పించింది ఎన్టీఆర్ అని, తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు – నగరికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆరేనన్నారు. వాటికి ఎన్టీఆర్ శంకుస్థాపన చేస్తే నేను అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిచేశానని చంద్రబాబు తెలిపారు. ఆనాడు గోదావరి – పెన్నా అనుసంధానం చేయాలని ఆలోచించబట్టే నేడు చిత్తూరు జిల్లాకు నీరు వచ్చిందని, దాని ఫలితంగానే కియామోటార్స్ వచ్చిందన్నారు. సీమకు ద్రోహం చేసింది ముమ్మాటికీ వైఎస్సేనన్నారు. సీమకు ప్రాజెక్టులు అవసరం లేదని ఆయన అధికారంలో ఉన్నప్పుడు అన్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.