కుప్ప కూలిన హెలికాప్టర్.. ఆర్మీచీఫ్ సహా 8 మంది మృతి
By సుభాష్
తైవాన్ దేశంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని తైపీ లో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో తైవాన్ ఆర్మీచీఫ్ సహా 8 మంది మృతి చెందగా, మరో ఇద్దరు ఉన్నతాధికారులు గల్లంతైనట్లు తెలుస్తోంది. రాజధాని తైపీ సమీపంలోని ఓ పర్వతంపై ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం జనవరి 1న ఉదయం ఈశాన్య యిలాన్ కౌంటిలోని సైనికులను కలుసుకునేందుకు మిలటరీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ షెన్-ఇన్-మింగ్ హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లారు. ఆయనతోపాటు 13 మంది ప్రయాణిస్తున్న యూహెచ్ 60ఎం హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.
కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. బయలుదేరిన హెలికాప్టర్ కంట్రోల్ రూమ్‌తో సిగ్నల్ కట్ కావడంతో అత్యవసరంగా తైపీ నగర సమీపంలో దిగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎయిర్‌ఫోర్స్ జనరల్ షెన్-యి-మింగ్ సహా 8 మంది దుర్మరణం చెందినట్లు తైవాన్ అధికారిక మీడియా ఓ ప్రకటనలో పేర్కొంది.