ముఖ్యాంశాలు

  • తహశీల్దార్ కేసులో తెరపైకి కొత్త కొత్త అంశాలు
  • విజయారెడ్డి సజీవ దహనం కేసులో మల్ రెడ్డి , మంచిరెడ్డి ఆరోపణలు
  • రియల్టర్లు రెచ్చగొట్టడం వల్లనే విజయారెడ్డిని సురేష్ చంపేశాడా..?

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనం కేసులో రాజకీయ లొల్లి మొదలైంది. ఏడు ఎకరాల భూమి వివాదంలో కొత్త కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి .

ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వేధింపుల వల్లే ఈ ఘటన జరిగిందని కాంగ్రెస్‌ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. తహశీల్దార్‌పై దాడికి పాల్పడ్డ సురేష్‌ ..కిషన్‌రెడ్డి అనుచరుడు అని ఆయన చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే మనుషులకు సంబంధించిన ఆరున్నర ఎకరాల భూమిని తహశీల్దార్‌ విజయారెడ్డి సీజ్‌ చేశారని…అప్పటి నుంచి కక్ష గట్టిన మంచిరెడ్డి అనుచరులు చివరకు ఆమె ప్రాణాలు తీశారని ఆరోపించారు.

అయితే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపణలను మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కొట్టిపారేశారు. సురేష్‌ తమ పార్టీ కార్యకర్త కాదని చెప్పుకొచ్చారు. ఆరు నెలల కిందట గౌరెల్లి గ్రామస్తులు తనని కలిసి మాట వాస్తమే అన్నారు. తమ భూమి సమస్య గురించి 60 మంది వచ్చి కలిశారని..వారిని వెంటబెట్టుకుని జాయింట్‌ కలెక్టర్‌ను కలిసినట్లు వివరించారు.

ఈ భూమి విషయంలో తాను తహశీల్దార్‌ను బెదిరించలేదని మంచిరెడ్డి చెప్పుకొచ్చారు. మల్‌రెడ్డి రంగారెడ్డి భూ దందాలను త్వరలోనే బయట పెడతానన్నారు. తనపై మూడు సార్లు ఓడిపోయిన మల్‌రెడ్డి ప్రస్టేషన్‌లో ఉన్నారని…అందుకే తనని వివాదాల్లోకి లాగాలని చూస్తున్నారని ఆరోపించారు.

ఈ ఇద్దరు నేతల ఆరోపణలు ఇలా ఉంటే…. ఈనాం భూములను క్రమబద్దీకరణ చేయిస్తానని రాజకీయ నేతలు రూ. 25 లక్షలు వసూలు చేశారట. మూడేళ్లు అయినా పని కాకపోవడంతో రూ.15 లక్షలు వెనక్కి ఇచ్చేశారట.
మరోవై ఔటర్‌ రింగ్‌ రోడ్డు పక్కనే ఉన్న ఈ భూములపై రియల్టర్ల కన్ను పడిందని తెలుస్తోంది. ఈ భూములను క్రమబద్దీకరిస్తే కొనాలిని కొందరు చూశారట. ఓ ఇద్దరు బడా రియల్టర్లు రెచ్చగొట్టడంతోనే సురేష్‌ రెచ్చిపోయి విజయారెడ్డిని టార్గెట్‌ చేశారని లోకల్‌గా జనం మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి విజయారెడ్డి సజీవదహనంతో చుట్టు పక్కల భూముల వివాదాలు అన్నీ తెరపైకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.