భర్త చెంప దెబ్బ కొట్టాడని.. విడాకుల కోసం కోర్టుకెక్కిన తాప్సీ
By Newsmeter.Network
టాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయమైన తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ లో దూసుకుపోతోంది. తొలుత గ్లామర్ పాత్రలకే పరిమితమైన ఈ ఢిల్లీ భామ ఇటీవల నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ మెపిస్తుంది. పింక్, బేబీ, నామ్ షబానా, ముల్క్, బద్లా, సాంధ్ కీ ఆంఖ్ చిత్రాలే ఇందుకు నిదర్శనం. తాజాగా ముల్క్ దర్శకుడు అనుభవ్ సిన్హా కాంబినేషన్‌లో మరో మహిళా ప్రాధాన్య చిత్రంలో నటిస్తోంది తాప్సీ.
తప్పడ్(చెంపదెబ్బ అని అర్థం) అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో మహిళా సమస్యలని చూపించనున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆరంభంలో.. తాను విడాకులు తీసుకోవడనికి గల కారణం గురించి తన లాయర్ కు చెబుతూ కనిపించింది తాప్సీ. మిమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకువెళ్లడానికి మీ భర్త నుంచి కోర్టు నోటీసులు వచ్చాయి అని లాయర్ చెప్పగానే నేను వెళ్లను అని చెబుతుంది. నీ భర్తకు ఏమైనా అఫైర్స్ ఉన్నాయా అని అడుగగా లేదు.. అని చెబుతుంది. మరీ నీకు ఏమైనా ఉన్నాయా అని లాయర్ అడుగగా నో అని చెబుతుంది. ఒక్క చెంపదెబ్బకే విడాకుల దాకా వెళ్తావా అంటూ లాయర్ ప్రశ్నించే తీరు.. వైవాహిక జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దంటూ తల్లి తాప్సీకి చెప్పే మాటలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి.
గృహిణిగా సంతోషకరమైన జీవితం గడుపుతున్న ఓ మహిళ జీవితం.. భర్త అందరి ముందూ తనను కొట్టిన ఒకే ఒక్క చెంపదెబ్బతో ఎలాంటి మలుపు తీసుకుంది. తన ఆత్మగౌరవం, భర్త చేత క్షమాపణ చెప్పించడం కోసం చట్టప్రకారం ఆమె పోరాడిన తీరు ఇతివృత్తంగా సినిమా రూపొందినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.