సైరా రివ్యూ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Oct 2019 7:24 AM GMT
సైరా రివ్యూ..!

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా న‌ర‌సింహారెడ్డి. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, అందాల తార న‌య‌న‌తార‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా, జ‌గ‌ప‌తిబాబు, సుదీప్, విజ‌య్ సేతుప‌తి...త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ దాదాపు 200 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. తెలుగు, త‌మిళ్, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ సంచ‌ల‌న చిత్రాన్ని ఈ రోజు అన‌గా అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేసారు. ఎన్నో భారీ అంచ‌నాల‌తో తెలుగు రాష్ట్రాల్లో 1,000 స్ర్కీన్స్ లో.. ప్ర‌పంచ వ్యాప్తంగా 5 వేల స్ర్కీన్స్ లో సైరా రిలీజైంది. ఇంత‌కీ... సైరా అంచ‌నాల‌ను అందుకుందా..? లేదా..? అనేది చెప్పాలంటే.. ముందుగా క‌థ చెప్పాల్సిందే.

క‌థ - తెర‌మ‌రుగైపోయిన తొలి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఇది. ఆంగ్లేయుల పై న‌ర‌సింహారెడ్డి తిరుగుబాటు చేసాడు. అత‌ని వెన‌కాల 9,000 వేల మంది సామాన్య జ‌నం త‌ర‌లి వ‌చ్చారంటే.. దానికి కార‌ణం ఏంటి..? ఎలా తిర‌గ‌బ‌డ్డాడు..? ప్ర‌జ‌ల్లో ఉద్య‌మాన్ని ఎలా తీసుకువ‌చ్చాడు..? ఈ వీరుడిని చూసి ఆంగ్లేయులు ఎందుకు భ‌య‌ప‌డ్డారు..? అంత‌లా న‌ర‌సింహారెడ్డి ఎలా భ‌య‌పెట్టాడు..? ఇంకా చెప్పాలంటే... చ‌రిత్ర‌పుట‌లు విస్మ‌రించ వీలులేని వీరుని క‌థే ఈ సైరా న‌ర‌సింహారెడ్డి క‌థ‌.

ప్లస్ పాయింట్స్

చిరంజీవి న‌ట‌న‌

యాక్ష‌న్ సీన్స్, సాంగ్స్

భారీ తారాగ‌ణం..

సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌,

రామ్ చ‌ర‌ణ్ రాజీలేని నిర్మాణం

అమిత్ త్రివేది సంగీతం

మైన‌స్ పాయింట్స్

ఫ‌స్టాఫ్ అక్క‌డ‌క్క‌డా స్లోగా అనిపించ‌డం..

విశ్లేష‌ణ - ఆలిని, బిడ్డ‌ని, అమ్మ‌ని, జ‌న్మ‌ని బంధ‌నాల్ని వ‌దిలి ఆంగ్లేయుల పై తొలి స‌మ‌ర‌భేరి మోగించిన యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పాత్ర‌లో మెగాస్టార్ చిరంజీవి అద్భుతంగా న‌టించారు. ఆ పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసారు. ఈ సినిమా చేస్తున్నంత సేపు న‌వ్వ‌డం మ‌ర‌చిపోయాను అని చిరంజీవి చెప్పారంటే... ఎంత‌లా లీన‌మై న‌టించారో అర్ధం చేసుకోవ‌చ్చు. ఆయ‌న స్ర్కీన్ పై క‌నిపిస్తున్నంత సేపు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి క‌నిపించారే త‌ప్పా... ఎక్క‌డా చిరంజీవి క‌నిపంచ‌లేదు. ఇక బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించి ఆక‌ట్టుకున్నారు. సుదీప్ పాత్ర సినిమాకి హైలైట్ అని చెప్ప‌చ్చు. అలాగే సిద్ధ‌మ్మ పాత్ర‌లో న‌య‌న‌తార‌, ల‌క్ష్మి పాత్ర‌లో త‌మ‌న్నా వీరారెడ్డి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు, రాజా పాండి పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి పాత్ర‌ల‌కు ప్రాణం పోసారు.

ఆలిని, బిడ్డ‌ని, అమ్మ‌ని, జ‌న్మ‌ని బంధ‌నాల్ని వ‌దిలి సాగుదాం..నువ్వే ల‌క్ష‌లై... ఒకే ల‌క్ష్య‌మై అని న‌య‌న‌తార‌, త‌మ‌న్నా ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి గురించి పాడుతుంటే... రొమాలు నిక్క‌బొడుచుకుంటాయి. అమిత్ త్రివేది అందించిన సంగీతం అద్భుతంగా ఉంది. ఇక శ్రేయో ఘోష‌ల్ వాయిస్.. ఈ పాట‌కు ప్రాణం పోసింది. విజువ‌ల్ వండ‌ర్ అన‌గానే మ‌నంద‌రికీ గుర్తొచ్చేది బాహుబ‌లి. వావ్ అద్భుతం అనేలా క‌ట్టిప‌డేసింది. సైరా కూడా బాహుబ‌లి సినిమాకి ఏమాత్రం తీసిపోకుండా... అద్భుతం అనేలా తీసారు. సైరాలో హైలైట్స్ లో యాక్ష‌న్స్ సీన్స్ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిందే. నాస‌మ్ ఫోర్ట్ వ‌ద్ద జ‌రిగే యాక్ష‌న్స్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి.

జాత‌ర పాట‌, ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకువచ్చేలా... ఉయ్యాలావాడ న‌ర‌సింహారెడ్డి గొప్ప‌త‌నం తెలియ‌చెప్పేలా సీతారామ శాస్త్రి రాసిన ప‌విత్ర థాత్రి భార‌తాంబు ముద్దు బిడ్డ అవురా..ఉయ్యాల‌వాడ న‌ర‌సింహుడా.. చ‌రిత్ర‌పుట‌లు విస్మ‌రించ వీలులేని వీర రేనాటి సీమ క‌న్న సూర్యుడా..నింగి శిర‌సు వంచి న‌మోస్తు నీకు అన‌గా న‌వోద‌యానివై జ‌యించినావురా..ఓ.. సైరా వింటుంటే ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి అంటూ సాగే పాట వింటుంటే రొమాలు నిక్క‌బొడుచుకున్నాయి అనేలా చిత్రీక‌రించారు ఈ పాట‌ను. రామ్ ల‌క్ష్మ‌ణ్ ఆధ్వ‌ర్యంలో చిత్రీక‌రించిన యాక్ష‌న్స్ సీన్స్ ప్ర‌తి ఒక్క‌రిని విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి.

ఫ‌స్టాఫ్ లో అక్క‌డ‌క్క‌డా స్లోగా అనిపించినా.. సెకండాఫ్ స్టార్ట్ అయిన త‌ర్వాత ఉత్కంఠ‌గా నెక్ట్స్ సీన్ లో ఏమౌంతుదో అని ఆస‌క్తితో చూసేలా సురేంద‌ర్ రెడ్డి అద్భుతంగా తెర‌కెక్కించారు. అమిత్ త్రివేది సంగీతం, జూలియ‌స్ పేకియం నేప‌థ్య సంగీతం బావున్నాయి. ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ సూప‌ర్. ఇలాంటి సినిమా చేయాలంటే... డ‌బ్బు ఉంటే స‌రిపోదు. సినిమా పై పిచ్చి ప్రేమ ఉండాలి. సినిమా పై అంత పిచ్చి ప్రేమ ఉంది కాబ‌ట్టే రామ్ చ‌ర‌ణ్ రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీ ఈ సినిమాని నిర్మించారు. ప్ర‌తి ఫ్రేమ్ లో సైరా టీమ్ క‌ష్టం... కాదు.. కాదు ఇష్టం క‌నిపిస్తుంది. ఈ సినిమా గురించి ఇంత చెప్పినా త‌క్కువే. ఒక్క మాట‌లో చెప్పాలంటే... తెలుగు సినిమా స‌త్తాను మ‌రోసారి ప్ర‌పంచానికి చాటి చెప్పిన సినిమా. తెలుగు వారంద‌రూ చూడాల్సిన సినిమా. సైరా... న‌ర‌సింహారెడ్డి.

రేటింగ్ 3.5/5

Next Story